పేటీఎం యూజర్లకు హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డులు !

20 Sep, 2021 21:23 IST|Sakshi

నగదు రహిత లావాదేవీలను పెంచేందుకు రెండు పెద్ద ఆర్థిక సంస్థలు సిద్ధమయ్యాయి. దేశంలోనే అతి పెద్ద ప్రైవేటు బ్యాంకు హెచ్‌డీఎఫ్‌సీ , పేటీఎంలు సంయుక్తంగా క్రెడిట్‌కార్డులు అందించేందుకు రెడీ అవుతున్నాయి.పండగ సీజన్‌ సందర్భంగా భారీ ఎత్తున క్రెడిట్‌ కార్డులు జారీ చేసి ప్రజల కొనుగోలు శక్తిని పెంచాలనుకుంటున్నట్టు హెచ్‌డీఎఫ్‌సీ ప్రకటించింది. ఈ మేరకు పేటీఎం సంస్థతో కలిసి పని చేస్తామని తెలిపింది.
చదవండి: Paytm : మొబైల్‌ బిల్స్‌ పేమెంట్స్‌పై పేటీఎమ్‌ బంపర్‌ ఆఫర్‌...!

యూత్‌పై పట్టుపెంచుకునే దిశలో..
ఆన్‌లైన్స్‌ ట్రాన్సాక‌్షన్‌ సర్వీసెస్‌ అందించే స్టార్టప్‌గా మార్కెట్‌లోకి వచ్చిన పేటీఎం అంచెలంచెలుగా ఎదిగింది. ప్రస్తుతం పేటీఎంకే 30 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. ఇందులో 21 కోట్ల మంది వ్యాపారులు, చిరు వ్యాపారులే ఉన్నారు. వీరిలో చాలా మందికి క్రెడిట్‌ కార్డులు లేవు. హెచ్‌డీఎఫ్‌సీకి దేశవ్యాప్తంగా 5 కోట్ల మంది క్రెడిట్‌కార్డు వినియోగదారులు ఉన్నారు. ఇందులో 3 కోట్ల మంది వ్యాపారులే ఉన్నారు. అయితే హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్‌ బేస్‌లో మిలీనియల్స్‌, యువకులు తక్కువగా ఉన్నారు. దీంతో యూత్‌లో పట్టు పెంచుకోవాలనేది హెచ్‌డీఎఫ్‌సీ మార్కెటింగ్‌ వ్యూహంగా ఉంది. దీంతో పేటీఎంతో జట్టు కట్టింది. 

దసరా, దీపావళి పండుగలను దృష్టిలో ఉంచుకొని..
పేటీఎం ఖాతాదారుల్లో అర్హులైన వారిని క్రెడిట్‌ కార్డు పరిధిలోకి తేవాలని హెచ్‌డీఎఫ్‌సీ యోచిస్తోంది. ఈ మేరకు రెండు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. నెలకు కొత్తగా 5 లక్షల వంతున క్రెడిట్‌కార్డులను అందివ్వాలని హెచ్‌డీఎఫ్‌సీ లక్ష్యంగా పెట్టుకుంది. దసరా, దీపావళి వంటి పండగ సీజన్‌లో ప్రజలకు ఆర్థిక అవసరాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో క్రెడిట్‌ కార్డులు జారీ చేయడం ద్వారా మార్కెట్‌లోకి త్వరగా దూసుకుపోవచ్చన్నది హెచ్‌డీఎఫ్‌సీ ప్రణాళికగా ఉంది. పేటీఎం సంస్థ గతంలో సిటీ బ్యాంకుతో ఒప్పందం చేసుకుంది .అయితే ఇటీవల ఇండియాలో రిటైల్‌ బ్యాంకింగ్‌ సర్వీస్‌ నుంచి తప్పుకోవాలని సిటీ బ్యాంకు నిర్ణయించింది. అదే సమయంలో హెచ్‌డీఎఫ్‌సీ సంస్థ పేటీఎంతో జత కట్టింది. ఈ రెండు సంస్థలు సంయుక్తంగా క్రెడిట్‌ కార్డులు అందివ్వనున్నాయి.
చదవండి: Paytm: పార్కింగ్‌లోనూ ఫాస్టాగ్‌, ప్రారంభించిన పేటీఎం

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు