హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌@ రూ. 8 లక్షల కోట్లు

25 Nov, 2020 13:29 IST|Sakshi

మార్కెట్‌ విలువలో బ్యాంక్‌ తాజా రికార్డ్

‌అత్యంత విలువైన కంపెనీలలో మూడో ర్యాంక్‌

తొలి రెండు స్థానాల్లో ఆర్‌ఐఎల్, టీసీఎస్‌

హెచ్‌యూఎల్‌, ఇన్ఫోసిస్‌కు నాలుగు, ఐదు ర్యాంకులు

మార్చిలో నమోదైన కనిష్టం నుంచి రెట్టింపైన షేరు ధర

ముంబై, సాక్షి: ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌(విలువ)లో ప్రయివేట్‌ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కొత్త రికార్డ్‌ సాధించింది. తొలిసారి రూ. 8 లక్షల కోట్ల మార్క్‌ను అధిగమించింది. తద్వారా దేశీ లిస్టెడ్‌ కంపెనీలలో మూడో ర్యాంకును కైవసం చేసుకుంది. నేటి ట్రేడింగ్‌ ప్రారంభంలో దాదాపు 2 శాతం లాభపడటం ద్వారా రూ. 1464 వద్ద సరికొత్త గరిష్టాన్ని సైతం షేరు తాకింది. దీంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ మార్కెట్‌ విలువ రూ. 8 ట్రిలియన్లను దాటింది. వెరసి గరిష్ట మార్కెట్‌ క్యాప్‌ను సాధించిన తొలి ఫైనాన్షియల్‌ రంగ సంస్థగా నిలిచింది. 

98 శాతం జూమ్‌
కోవిడ్‌-19 కారణంగా ఈ ఏడాది మార్చిలో మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలిన సంగతి తెలిసిందే. దీంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేరు రూ. 739 వరకూ పతనమైంది. ఆ స్థాయి నుంచి ర్యాలీ బాట పట్టి తాజాగా రూ. 1464కు చేరింది. వెరసి 8 నెలల్లో 98 శాతం దూసుకెళ్లింది. ఈ బాటలో గత మూడు నెలల్లో 30 శాతం, గత నెల రోజుల్లో 17 శాతం చొప్పున బలపడుతూ వచ్చింది. ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్‌)లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ నికర లాభం 18 శాతంపైగా ఎగసి రూ. 7,513 కోట్లను తాకింది. నికర వడ్డీ ఆదాయం 17 శాతం వృద్ధితో రూ. 15,776 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్లు 4.1 శాతంగా నమోదయ్యాయి.

జాబితా ఇలా
లిస్టెడ్‌ కంపెనీల మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ర్యాంకింగ్స్‌లో ముకేశ్‌ అంబానీ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రూ. 13.34 లక్షల కోట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. టాటా గ్రూప్‌ సాఫ్ట్‌వేర్‌ సేవల దిగ్గజం టీసీఎస్‌ రూ. 10.19 ట్రిలియన్ల విలువతో రెండో ర్యాంకులో నిలుస్తోంది. ఇదే విధంగా రూ. 5.08 లక్షల కోట్లతో ఎఫ్‌ఎంసీజీ బ్లూచిప్‌ కంపెనీ హెచ్‌యూఎల్‌, రూ. 4.83 ట్రిలియన్ల విలువతో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ 4, 5 ర్యాంకులను పొందుతున్నాయి. కాగా.. పోటీ సంస్థలతో పోలిస్తే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ప్రీమియంతో ట్రేడయ్యేందుకు అర్హత కలిగి ఉన్నట్లు విదేశీ రీసెర్చ్‌ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ అభిప్రాయపడింది. పటిష్ట లాభదాయకత, నిలకడైన మార్జిన్లు, అండర్‌రైటింగ్‌ నాణ్యత వంటి పలు అంశాలు బ్యాంకునకు సానుకూల అంశాలుగా పేర్కొంది. దీంతో రూ. 1,700 టార్గెట్‌ ధరతో కొనుగోలుకి సిఫారసు చేస్తోంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేరు 0.7 శాతం వెనకడుగుతో రూ. 1428 వద్ద ట్రేడవుతోంది. ఇంట్రాడేలో రూ. 1454 వద్ద గరిష్టాన్ని తాకగా, రూ. 1421 దిగువన కనిష్టాన్ని చవిచూసింది.

మరిన్ని వార్తలు