మీ ఉద్యోగాలు, ఇంక్రిమెంట్లు, బోనస్‌లు భద్రం

7 Oct, 2020 08:01 IST|Sakshi

ముంబై: దేశంలోని ప్రైవేటు బ్యాంకింగ్‌ దిగ్గజాల్లో ఒకటైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అండ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ ఆదిత్యపురి తమ ఉద్యోగులకు ఉద్యోగాలు, ఇంక్రిమెంట్లు, బోనస్‌ల విషయంలో కొండంత భరోసాను ఇచ్చారు. అవన్నీ భద్రమని, ఆందోళనలు అర్థరహితమని ఆయన  పేర్కొన్నారు. కరోనా ప్రేరిత అంశాలు ఉద్యోగాలపై ప్రతికూల ప్రభావం చూపుతున్న నేపథ్యంలో ఆదిత్యపురి 1.15 లక్షల మంది బ్యాంక్‌ ఉద్యోగులకు ఇటీవల 10 నిముషాల  వీడియో సందేశం పంపా రు. ‘‘మీకు ఉద్యోగ భద్రతేకాదు. ప్రమోషన్లు, ఇంక్రిమెం ట్లు, బోనస్‌లూ అన్నీ భద్రం’ అని ఆయన సందేశంలో పేర్కొన్నారు.  తన వారసుడు శశిధర్‌ జగదీశన్‌సహా మేనేజ్‌మెంట్‌ తరఫున తాను ఈ హామీ ఇస్తున్నట్లు తెలిపారు. 25 సంవత్సరాల సుదీర్ఘ బాధ్యతల నుంచి ఈ నెలాఖరున పదవీవిరమణ చేస్తున్న పురి, బ్యాంకు పండుగల ఆఫర్‌ ప్రకటనను (సెకండ్‌ ఎడిషన్‌) పురస్కరించుకుని చేసిన తాజా సందేశంలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... 

⇔ కోవిడ్‌–19 ప్రతికూల ప్రభావాల సమయాల్లోనూ బ్యాంక్‌ చక్కటి పనితీరును ప్రదర్శిస్తోంది. తగిన మూలధన నిల్వలను నిర్వహిస్తోంది. తాను మంజూరు చేసిన రుణాల విషయంలో ఎటువంటి ఒత్తిడినీ ఎదుర్కొనడంలేదు. ఈ ఆర్థిక సంవత్సరం జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికంలో చక్కటి ఫలితాలను నమోదుచేసుకుంది. భవిష్యత్తులోనూ ఇదే ధోరణి కొనసాగుతుంది.   

⇔ రుణాల పంపిణీ, వసూళ్లు వంటి అంశాలతో పాటు పలు విభాగాల్లో బ్యాంక్‌ సాంకేతికత వినియోగం ఎంతో ముందుంది.  

⇔ ఉద్యోగులుగా మీరు చేయాల్సింది ఒకటే. ‘టీమ్‌ వర్క్‌’ చేయండి. పనిలో దార్శినికతను ప్రదర్శించండి. పోటీ తత్వంలో ఇది కీలకమైన అంశం. ఈ విషయంలో మనం నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు కృషి చేయండి.  

⇔ కరోనా వైరస్‌ ప్రతికూల ప్రభావాల విషయంలో ఓటమిని బ్యాంక్‌ ఎప్పుడూ అంగీకరించలేదు. రెండు త్రైమాసికాల నుంచీ మంచి ఫలితాలను బ్యాంక్‌ నమోదుచేసుకుంటున్న విషయం ఇక్కడ ప్రస్తావనాంశం.  

⇔ బ్యాంక్‌ ప్రకటించిన పండుగల సీజన్‌ ఆఫర్లను మార్కెట్‌లోకి విస్తృతంగా తీసుకువెళ్లడానికి సోషల్‌ మీడియాను ఉద్యోగులు వినియోగించుకోవాలి.  

⇔ బ్యాంకు వ్యాపార కార్యకలాపాలు కరోనా–19 పూర్వపు స్థితికి క్రమంగా చేరుకుంటున్నాయి.  అతి త్వరలోనే సాధారణ స్థాయికి చేరుకుంటాయి.  

⇔ కరోనా వైరస్‌ మన అందరి జీవితాల్లోనూ అవరోధాలు కల్పించింది. ఈ వైరస్‌తోనే కొన్నాళ్లు జీవించాల్సి ఉంటుంది. కాకపోతే వాతావరణాన్ని, ఈ పరిస్థితిని భద్రం గా మార్చుకోవడం అన్నది మీపైనే ఉంటుంది. కష్టాల్లోనూ ఆశావాదంవైపు నడవాలి. అవకాశాలు వెతుక్కోవాలి.  వైరస్‌ ఏదో ఒక రోజు వెళ్లిపోతుంది. ఆందోళన అక్కర్లేదు.  

ప్రత్యేక ఆఫర్లకు చక్కటి స్పందన...
పండుగల సీజన్‌ను పురస్కరించుకుని ప్రకటించిన ‘ఫెస్టివ్‌ ట్రీట్స్‌’ గురించి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు పేమెంట్‌ బిజినెస్‌ కంట్రీ హెడ్‌ పరాగ్‌రావు వివరిస్తూ,  ఈ ప్లాట్‌ఫామ్‌ నుంచి బ్యాంకుకు సంబంధించిన అన్ని రకాల ప్రొడక్టులపై ప్రత్యేక ఆఫర్లను పొందొచ్చని తెలిపారు. రుణాల నుంచి క్రెడిట్‌ కార్డుల వరకు, ప్రముఖ విక్రేతలకు సంబంధించి 1,000 రకాల ఆఫర్లు అందుబాటులో ఉన్నట్టు ప్రకటించారు. ఎంతో అద్భుతమైన డిమాండ్‌ కనిపిస్తోందంటూ.. ఫెస్టివ్‌ ట్రీట్స్‌ ప్లాట్‌ఫామ్‌పై 30–35 శాతం తగ్గింపులను ఇస్తున్నట్టు చెప్పారు. మొబైల్స్, కన్జ్యూమర్‌ డ్యురబుల్స్, వస్త్రాలు, జ్యుయలరీ, డైనింగ్‌ విభాగాల్లో గత 2–3 నెలల్లో కస్టమర్ల ఆసక్తి పెరిగిందని, పండుగల సీజన్‌లోనూ ఇది కొనసాగుతుందని భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు