పురీ వేవ్‌- హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ రికార్డ్స్‌

27 Oct, 2020 14:08 IST|Sakshi

బ్యాంక్‌ ఎండీ, సీఈవో ఆదిత్య పురీ పదవీ విరమణ

రెండున్నర దశాబ్దాలపాటు అత్యుత్తమ సేవలు

పురీ నేతృత్వంలో టాప్‌ చెయిర్‌కు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌

నేటి(26) నుంచి శశిధర్‌ జగదీశన్‌కు పదవీ బాధ్యతలు

ప్రయివేట్‌ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ను రెండున్నర దశాబ్దాలపాటు ముందుండి నడిపించిన ఆదిత్య పురీ సోమవారం(26న) పదవీ విరమణ చేశారు. దీంతో కొత్త ఎండీ, సీఈవోగా శశిధర్‌ జగదీశన్‌ బాధ్యతలు చేపట్టారు. బ్యాంకు అదనపు డైరెక్టర్‌, ఫైనాన్స్‌ హెడ్‌గా విధులు నిర్వహిస్తున్న శశిధర్‌ ఎండీ, సీఈవో బాధ్యతలను పురీ నుంచి స్వీకరించారు. పురీ 1994 సెప్టెంబర్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఎండీగా పదవిని చేపట్టారు. ఆపై బ్యాంక్‌ పలు విధాలుగా వృద్ధి బాటలో పరుగు పెట్టింది. తద్వారా తీవ్రమైన పోటీలోనూ బ్యాంకు తొలి స్థానంలో నిలుస్తూ వచ్చింది. 

ప్రస్థానమిలా
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 1995 మే 19న బీఎస్‌ఈలో లిస్టయ్యింది. అప్పట్లో బ్యాంకు ఆస్తులు రూ. 3,394 కోట్లుగా నమోదుకాగా.. ప్రస్తుతం రూ. 16 లక్షల కోట్లకుపైగా విస్తరించాయి. మొత్తం డిపాజిట్లు రూ. 642 కోట్ల నుంచి రూ. 12.29 లక్షల కోట్లకు ఎగశాయి. ఇదేవిధంగా 1995 మార్చిలో రూ. 98 కోట్లుగా ఉన్న రుణాలు(అడ్వాన్సులు) 2020 సెప్టెంబర్‌కల్లా రూ. 10.38 లక్షల కోట్లను తాకాయి. వెరసి పురీ హయాంలో బ్యాంక్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌(విలువ) రూ. 7 లక్షల కోట్లకు చేరింది. వెరసి ప్రయివేట్‌ రంగ బ్యాంకులలో టాప్‌ ర్యాంకుకు చేరుకుంది. 1997లో బ్యాంక్‌ మార్కెట్‌ క్యాప్‌ తొలిసారి రూ. 1,000 కోట్లను అధిగమించింది. గత 25 సంవత్సరాలలో బ్యాంకు షేరు రూ. 3 నుంచి రూ. 1,200కు దూసుకెళ్లింది. అంటే 1995 నుంచి చూస్తే 30,000 శాతానికిపైగా రిటర్నులు అందించింది.

లాభాల బాటలో
ఏస్‌ ఈక్విటీ వివరాల ప్రకారం 1995 మే చివర్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ మార్కెట్‌ విలువ రూ. 432 కోట్లను తాకింది. ఆపై 1997 కల్లా రూ. 1,000 కోట్లను అధిగమించగా.. 2005 జులై 6న రూ. 20,130 కోట్లకు చేరింది. ఈ బాటలో 2007 కల్లా రూ. 50,000 కోట్లు, 2010 ఆగస్ట్‌లో రూ. లక్ష కోట్ల మార్క్‌ను దాటేసింది. తిరిగి 2018 జనవరిలో మరింత వృద్ధి చూపుతూ రూ. 5 లక్షల కోట్లను తాకింది. ఇక ప్రస్తుతం అంటే 2020 అక్టోబర్‌ 27కల్లా బ్యాంక్‌ మార్కెట్‌ క్యాప్‌ రూ. 6.73 లక్షల కోట్లకు చేరింది.ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో 1 శాతం పుంజుకుని రూ. 1,223 వద్ద ట్రేడవుతోంది. 

షేర్ల విభజన
గతంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ రెండుసార్లు షేర్ల ముఖ విలువను విభజించింది. 2011లో రూ. 10 ముఖ విలువను రూ. 2కు, తిరిగి 2019లో రూ. 2 నుంచి రూ. 1కు షేర్ల విభజన చేపట్టింది. ప్రస్తుతం బీఎస్‌ఈ డేటా ప్రకారం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో ప్రమోటర్ల వాటా ప్రస్తుతం 26.02 శాతంగా నమోదైంది. పబ్లిక్‌ వాటా దాదాపు 74 శాతానికి చేరింది. వీటిలో మ్యూచువల్‌ ఫండ్స్‌ 13.95 శాతం, ఎల్‌ఐసీ 3.79 శాతం చొప్పున వాటాలు కలిగి ఉన్నాయి. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) 37.43 శాతం వాటాను సొంతం చేసుకున్నారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు