మళ్లీ ‘రియల్‌‘ బూమ్‌!

18 Feb, 2022 03:19 IST|Sakshi

ఇంత అనుకూల వాతావరణం ఎప్పుడూ లేదు

హెచ్‌డీఎఫ్‌సీ చైర్మన్‌ దీపక్‌ పరేఖ్‌

ముంబై: భారత రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ వృద్ధి చక్రంలో ఉందని, ఇళ్లకు ఇక ముందూ డిమాండ్‌ బలంగానే ఉంటుందని హెచ్‌డీఎఫ్‌సీ చైర్మన్‌ దీపక్‌ పరేఖ్‌ అన్నారు. పాశ్చాత్య దేశాల మాదిరిగా కాకుండా భారత్‌లో ఇళ్ల మార్కెట్‌ వాస్తవికంగా ఉంటుందని, స్పెక్యులేషన్‌ శైలితో నడవదన్నారు. సీఐఐ రియల్‌ ఎస్టేట్‌ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కొత్త ప్రాజెక్టుల ప్రారంభం కరోనా ముందస్తు స్థాయిని దాటిపోవడం బలమైన విశ్వాసానికి నిదర్శనంగా దీపక్‌ పరేఖ్‌ పేర్కొన్నారు. మొదటిసారి ఇళ్లను కొనుగోలు చేసే వారితోపాటు, పెద్ద ఇళ్లకు మారేవారి నుంచి డిమాండ్‌ వస్తున్నట్టు చెప్పారు.

‘‘నా 50 ఏళ్ల వృత్తి జీవితంలో ఇళ్లు అందుబాటు ధరల్లో లభించడం ఇప్పుడున్న మాదిరిగా ఎప్పుడూ చూడలేదు. పుష్కలమైన నగదు లభ్యత, కనిష్ట వడ్డీ రేట్లు, ఇంటి యజమాని కావాలనే కోరికను గతంలో ఈ స్థాయిలో చూడలేదు. పాశ్చాత్య దేశాల్లో ఇళ్ల ధరలు కరోనా విపత్తు సమయంలో గణనీయంగా పెరగడం చూసే ఉంటారు. సరఫరా పెరగకపోవడానికితోడు, పెట్టుబడులు, స్పెక్యులేషన్‌ ధోరణి ధరలు పెరగడానికి కారణం. కానీ భారత్‌తో ఇళ్లకు డిమాండ్‌ నిజమైన కొనుగోలు దారుల నుంచే వస్తుంది. ఇళ్ల ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. కనిష్ట వడ్డీ రేట్లు మద్దతుగా నిలిచాయి. రియల్‌ ఎస్టేట్‌ పరిశ్రమ గత క్షీణత సైకిల్‌ నుంచి కోలుకుంది’’అని పరేఖ్‌ వివరించారు.

ఆదాయాలు పెరిగాయి...
జీడీపీలో మార్ట్‌గేజ్‌ నిష్పత్తి 11 శాతంగా ఉన్నట్టు దీపక్‌ పరేఖ్‌ తెలిపారు. ఐటీ, ఈ కామర్స్, ప్రొఫెషనల్‌ సర్వీసులు, ఆర్థిక సేవల రంగం, పెద్ద కంపెనీల్లో పనిచేసేవారు, నూతన తరం పారిశ్రామికవేత్తలకు ఆదాయ స్థాయిలు పెరిగాయని చెప్పారు. భారత్‌లో ఆదాయ స్థాయిలు పెరిగితే చిన్న వయసులోనే ఇళ్లను కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతారని పేర్కొన్నారు. ప్రీమియం ప్రాజెక్టుల ధరలు 15–20 శాతం వరకు పెరిగినట్టు చెప్పారు. కానీ, అందుబాటు ధరల ఇళ్లు ఇప్పటికీ రూ.50 లక్షల నుంచి రూ.కోటి మధ్య  ఉన్నట్టు తెలిపారు. వడ్డీ రేట్లు స్వల్పంగా పెరిగితే అది ఇళ్ల డిమాండ్‌పై ప్రభావం చూపబోదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. పర్యావరణ, సామాజిక, పరిపాలన (ఈఎస్‌జీ) కాన్సెప్ట్‌కు ఇళ్ల నిర్మాణంలో ప్రాధాన్యం ఇవ్వాలని డెవలపర్లకు çపరేఖ్‌ సూచించారు.

కరోనా కాలంలోనూ..
కరోనా కారణంగా లాక్‌డౌన్‌లు విధించినా, పలు విడతలుగా మహమ్మారి విరుచుకుపడినా.. రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ తిరిగి బలంగా నిలదొక్కుకుంది. అంతేకాదు వృద్ధి క్రమంలో ప్రయాణిస్తోంది. నివాస గృహాల మార్కెట్‌ వృద్ధి క్రమంలోకి అడుగుపెట్టింది. ప్రభుత్వం నుంచి విధానపరమైన మద్దతుకుతోడు, కనిష్ట వడ్డీ రేట్లు ఉండడంతో 2022లోనూ రియల్‌ ఎస్టేట్‌ పరిశ్రమ వృద్ధి సానుకూలంగా ఉంటుంది. ముడి సరుకుల ధరలు అదే పనిగా పెరిగిపోవడం 2021లో ఇళ్ల ధరలు పెరిగేందుకు దారితీసింది.
– ధ్రువ్‌ అగర్వాల్, ప్రాప్‌టైగర్‌.కామ్‌ గ్రూపు సీఈవో 

మరిన్ని వార్తలు