హెచ్‌డీఎఫ్‌సీ విలీనానికి 10 నెలలు

26 Nov, 2022 05:57 IST|Sakshi

అడెక్వసీ రేషియో పెరుగుతుంది

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఎండీ జగదీశన్‌

ముంబై: మాతృ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీని విలీనం చేసుకునేందుకు మరో 8–10 నెలల సమయం పడుతుందని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఎండీ, సీఈవో శశిధర్‌ జగదీశన్‌ పేర్కొన్నారు. విలీనం వల్ల హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు క్యాపిటల్‌ అడెక్వెసీ రేషియో 0.20–0.30 శాతం మేర పెరుగుతుందని తెలిపారు. ఈ రెండు సంస్థలు విలీనంపై ఆమోదం కోసం శుక్రవారం వాటాదారుల సమావేశాన్ని నిర్వహించాయి. దేశ చరిత్రలో ఇది అతిపెద్ద విలీనం కానుంది. అయితే, విలీనం వల్ల బ్యాలన్స్‌ షీటు పెద్దగా మారనుంది.

దీంతో ఆర్‌బీఐ నియంత్రణలకు అనుగుణంగా తప్పనిసరిగా నిర్వహించాల్సిన నగదు నిల్వలు, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అవసరాలను వాటాదారులు ప్రస్తావించారు. ఈ విషయంలో ఆర్‌బీఐ నుంచి ఉపశమనం వచ్చే అవకాశం ఉందా? అనేది తెలుసుకోవాలని అనుకున్నారు. దీనిపై హెచ్‌డీఎఫ్‌సీ చైర్మన్‌ దీపక్‌ పరేఖ్‌ స్పందిస్తూ.. ఈ విషయంలో వాటాదారులు ఆందోళన చెందవద్దంటూ, ఆర్‌బీఐతో సంప్రదింపులు చేస్తున్నట్టు చెప్పారు. ఒకవేళ ఆర్‌బీఐ నుంచి ఏదైనా మినహాయింపు రాకపోయినా, విలీన సంస్థ వద్ద తగినంత లిక్విడిటీ ఉంటుందని.. తప్పనిసరి నిధుల అవసరాలను చేరుకునేం­దుకు ప్రత్యామ్నాయ మార్గాలున్నట్టు తెలిపారు.  

కొన్నింటిని విక్రయిస్తాం..
విలీనం తర్వాత హెచ్‌డీఎఫ్‌సీ అనుబంధ సంస్థలన్నీ కూడా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ అనుబంధ కంపెనీలుగా మారతాయని.. బ్యాంక్‌ చైర్మన్‌ అతాను చక్రవర్తి తెలిపారు. అదే సమయంలో బ్యాంకు కిందకు రాని కొన్ని వ్యాపారాలను (నిబంధనల మేరకు) విక్రయిస్తామని చెప్పారు. సబ్సిడరీల విలీనానికి ఆర్‌బీఐ, ఐఆర్‌డీఏఐ అనుమతి కోరతామన్నారు. వయసు రీత్యా తాను హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ బోర్డులో చేరబోనని, చక్రవర్తి చైర్మన్‌గా సేవలు అందిస్తారని దీపక్‌ పరేఖ్‌ స్పష్టం చేశారు. విలీనంతో హెచ్‌డీఎఫ్‌సీ డిపాజిట్లు అన్నీ బ్యాంక్‌ కిందకు వస్తాయని, వాటికి వడ్డీ చెల్లింపులు ఎప్పటి మాదిరే చేస్తామని జగదీశన్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు