క్యాడిలా హెల్త్‌కేర్‌- హెచ్‌డీఎఫ్‌సీ.. జోరు

3 Nov, 2020 11:04 IST|Sakshi

క్యూ2(జులై- సెప్టెంబర్‌) ఫలితాల ఎఫెక్ట్‌

13 శాతం దూసుకెళ్లిన క్యాడిలా హెల్త్‌కేర్‌

52 వారాల గరిష్టానికి చేరిన క్యాడిలా షేరు

2 రోజుల్లో 10 శాతం జంప్‌చేసిన హెచ్‌డీఎఫ్‌సీ

7 నెలల గరిష్టాన్ని తాకిన హెచ్‌డీఎఫ్‌సీ షేరు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో మార్టిగేజ్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌ కౌంటర్‌కు డిమాండ్‌ కొనసాగుతోంది. కాగా.. మరోపక్క ఈ ఆర్థిక సంవత్సరం​క్యూ2(జులై- సెప్టెంబర్‌)లో ఆకర్షణీయ పనితీరు చూపడంతో ఫార్మా రంగ కంపెనీ క్యాడిలా హెల్త్‌కేర్‌ కౌంటర్‌ తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం..

హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌
ప్రయివేట్‌ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌ ఈ ఏడాది క్యూ2లో రూ. 2,870 కోట్ల నికర లాభం​ఆర్జించింది. గతేడాది(2019-20) క్యూ2తో పోలిస్తే ఇది 28 శాతం క్షీణతకాగా.. గతంలో పెట్టుబడుల విక్రయం ద్వారా డివిడెండ్‌ ఆదాయం భారీగా లభించడంతో లాభాలు పెరిగినట్లు విశ్లేషకులు తెలియజేశారు. కాగా.. నికర వడ్డీ ఆదాయం 21 శాతం ఎగసి రూ. 3,647 కోట్లను తాకింది. నిర్వహణలోని ఆస్తుల విలువ(ఏయూఎం) 10 శాతంపైగా పెరిగి రూ. 5.4 ట్రిలియన్లను తాకింది. వీటిలో వ్యక్తిగత రుణాల వాటా 75 శాతం. స్థూల మొండిబకాయిలు(జీఎన్‌పీఏలు) 6 బేసిస్‌ పాయింట్లు తగ్గి 1.81 శాతానికి చేరాయి. ఈ నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ షేరు ఎన్‌ఎస్‌ఈలో తొలుత 4 శాతం జంప్‌చేసి రూ. 2,119ను తాకింది. ఇది మార్చి 13 తదుపరి గరిష్టంకాగా.. ప్రస్తుతం 3 శాతం లాభంతో రూ. 2,104 వద్ద ట్రేడవుతోంది. గత రెండు రోజుల్లో ఈ షేరు 10 శాతం ర్యాలీ చేయడం గమనార్హం.

క్యాడిలా హెల్త్‌కేర్‌
ఈ ఏడాది క్యూ2లో క్యాడిలా హెల్త్‌కేర్‌ నికర లాభం సర్దుబాట్ల తదుపరి 73 శాతం ఎగసింది. రూ. 562 కోట్లను తాకింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన మొత్తం ఆదాయం 13 శాతంపైగా వృద్ధితో రూ. 3,820 కోట్లకు చేరింది. యూఎస్‌ మార్కెట్లలో అమ్మకాలు 18 శాతం పుంజుకుని రూ. 1,709 కోట్లుగా నమోదయ్యాయి. దేశీయంగా ఫార్ములేషన్ల అమ్మకాలు సైతం 11 శాతం అధికంగా రూ. 1,087 కోట్లకు చేరాయి. ఈ నేపథ్యంలో క్యాడిలా షేరు ఎన్‌ఎస్‌ఈలో తొలుత 13 శాతం దూసుకెళ్లింది. రూ. 464 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. ప్రస్తుతం 7 శాతం లాభపడి రూ. 438 వద్ద ట్రేడవుతోంది. 

మరిన్ని వార్తలు