హెచ్‌డీఎఫ్‌సీ లాభం అప్‌ క్యూ3లో రూ. 7,078 కోట్లు

3 Feb, 2023 13:10 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రయివేట్‌ రంగ మార్టిగేజ్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన అక్టోబర్‌- డిసెంబర్‌(క్యూ3)లో నికర లాభం 15 శాతం పుంజుకుని రూ. 7,078 కోట్లకు చేరింది. స్టాండెలోన్‌ నికర లాభం సైతం రూ. 3,261 కోట్ల నుంచి రూ. 3,691 కోట్లకు ఎగసింది. నికర వడ్డీ ఆదాయం 13 శాతం మెరుగై రూ. 4,840 కోట్లను తాకింది. నికర వడ్డీ మార్జిన్లు 3.5 శాతంగా నమోదయ్యాయి. స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 2.32 శాతం నుంచి 1.49 శాతానికి దిగివచ్చాయి.  

వడ్డీ రేట్ల ఎఫెక్ట్‌ 
ఆర్‌బీఐ వడ్డీ రేట్ల పెంపు నేపథ్యంలో లాభదాయకత మందగించినట్లు హెచ్‌డీఎఫ్‌సీ వైస్‌చైర్మన్, సీఈవో కేకి మిస్త్రీ వెల్లడించారు. అయితే రుణాలను కొత్త రేట్లకు వేగంగా అనుసంధానిస్తున్నట్లు, ఈ ప్రభావం రుణాలపై తదుపరి త్రైమాసికం నుంచీ ప్రతిఫలించనున్నట్లు తెలియజేశారు. వ్యక్తిగత రుణ విభాగం 26 శాతం వృద్ధిని సాధించగా.. సగటు టికెట్‌(రుణ) పరిమాణం రూ. 35.7 లక్షలకు బలపడినట్లు వెల్లడించారు. రూ. 18 లక్షలకుపైగా వార్షిక ఆదాయంగల రుణగ్రహీతలు 52 శాతంగా తెలియజేశారు. గ్రూప్‌ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు విలీనంపై ఆర్‌బీఐ, ఎన్‌సీఎల్‌టీ నుంచి నిర్ణయాలు వెలువడవలసి ఉన్నట్లు పేర్కొన్నారు.  
 

మరిన్ని వార్తలు