హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ క్యూ3 గుడ్‌

17 Jan, 2023 10:07 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రయివేట్‌ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం 20 శాతం జంప్‌చేసి రూ. 12,698 కోట్లను తాకింది. వడ్డీ ఆదాయం మెరుగుపడటం ఇందుకు సహకరించింది. స్టాండెలోన్‌ నికర లాభం సైతం 19 శాతం బలపడి రూ. 12,260 కోట్లయ్యింది. ఈ కాలంలో 20 శాతం రుణ వృద్ధి కారణంగా నికర వడ్డీ ఆదాయం 25 శాతం ఎగసి రూ. 22,988 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్లు 4.1 శాతంగా నమోదయ్యాయి. ఇతర ఆదాయం రూ. 300 కోట్లు పెరిగి రూ. 8,540 కోట్లకు చేరింది. 

రుణ నాణ్యత అప్‌: క్యూ3లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ స్థూల మొండిబకాయిలు (ఎన్‌పీఏలు) నిలకడను చూపుతూ 1.23%గా నమోదైంది. నిర్వహణ వ్యయాలు 27 శాతం పెరిగి రూ. 12,464 కోట్లకు చేరగా.. 4,000 మంది ఉద్యోగులను జత చేసుకుంది. దీంతో మొత్తం సిబ్బంది సంఖ్య 1,66,890ను తాకింది.  . కాగా.. అనుబంధ సంస్థలలో హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ నికర లాభం రూ. 258 కోట్ల నుంచి రూ. 203 కోట్లకు తగ్గింది. హెచ్‌డీబీ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ లాభం రూ. 304 కోట్ల నుంచి రూ. 501 కోట్లకు జంప్‌చేసింది. 
ఫలితాల నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేరు 1% బలహీనపడి రూ. 1,586 వద్ద ముగిసింది.

చదవండి: సేల్స్‌ రచ్చ మామూలుగా లేదు, ఎలక్ట్రిక్‌ కార్ల అమ్మకాల్లో నంబర్‌ వన్‌!

మరిన్ని వార్తలు