ఆరోగ్య బీమా పాలసీలపై ఐఆర్‌డీఏఐ కీలక నిర్ణయం

19 Mar, 2021 17:12 IST|Sakshi

ప్రస్తుతం ఉన్న బీమా పాలసీల్లో ఎలాంటి మార్పులు చేయరాదని భీమా సంస్థలను‌‌ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్‌డీఏఐ) ఆదేశించింది. పాలసీల్లో మార్పుల వల్ల బీమా ప్రీమియంలు పెరిగి పాలసీదారులు ఇబ్బంది పడే అవకాశం ఉంది అని తెలిపింది. వ్యక్తిగత బీమా, ప్రయాణ బీమా కవరేజీల జోలికీ వెళ్లరాదని తెలిపింది. పాలసీదారుల అంగీకారంపై స్టాండలోన్‌ ప్రీమియం రేటుతో ప్రస్తుత ప్రయోజనాలకు కొత్త వాటిని జత చేసుకోవచ్చని బీమా సంస్థలకు ఐఆర్‌డీఏఐ సూచించింది. అలాగే ఆరోగ్య బీమా వ్యాపారంలో పాలసీల కోసం గత ఏడాది జూలైలో జారీ చేసిన ఏకీకృత మార్గదర్శకాలకు అనుగుణంగా స్వల్ప మార్పులు చేసుకునేలా అనుమతి ఇచ్చింది. 

బీమా రంగంలో ఎఫ్‌డీఐ పరిమితిని 74 శాతానికి పెంచేందుకు గురువారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా జరిగిన చర్చలలో బీమా సంస్థల మూలధన అవసరాలను తీర్చడానికి ఎఫ్‌డీఐ దోహద పడుతుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రజలు కరోనా వ్యాక్సిన్‌ తీసుకుంటున్న నేపథ్యంలో ఐఆర్‌డీఏఐ ఓ కీలక నిర్ణయం వెల్లడించింది. ఆరోగ్య బీమా ఉన్నవారు కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత రియాక్షన్‌కు గురై ఆస్పత్రిలో చేరినట్లయితే ఆ ఖర్చులు బీమా పరిధిలోకి వస్తాయని గురువారం ప్రకటించారు.

దేశంలో ఆరోగ్య బీమా విస్తరణను కాంక్షిస్తూ బీమా రంగ నియంత్రణ సంస్థ(ఐఆర్‌డీఏఐ) ఆరోగ్య సంజీవని(ప్రామాణిక బీమా పాలసీ) పాలసీ కింద కనీస ఆరోగ్య బీమా కవరేజీని రూ.50,000కు తగ్గించింది. అదే సమయంలో ఈ పాలసీ కింద గరిష్ట కవరేజీని రూ.10లక్షలకు పెంచింది. ప్రజలు అర్థం చేసుకునేందుకు సులభమైన ఆరోగ్య బీమా ప్లాన్‌ను ఆరోగ్య సంజీవని పేరుతో తీసుకురావాలంటూ ఐఆర్‌డీఏఐ గతంలో ఆదేశించింది. దీంతో దాదాపు అన్ని సాధారణ, ఆరోగ్య బీమా సంస్థలు ఆరోగ్య సంజీవని ప్లాన్‌ను ఆఫర్‌ చేస్తున్నాయి. ఈ ప్లాన్‌ కింద రూ.1-5లక్షల మధ్య కవరేజీని ఆఫర్‌ చేయాలని అప్పట్లో ఐఆర్‌డీఏఐ ఆదేశించింది. ఇప్పుడు ఈ పరిమితిని రూ.50,000-10,00000గా సవరించింది. ఈ ఏడాది మే 1 నుంచి ఈ మార్పులు అమల్లోకి వస్తాయని ఐఆర్‌డీఏఐ తన ఆదేశాల్లో పేర్కొంది.  

చదవండి:

ఎల్‌ఐసీ పాలసీదారులకు శుభవార్త!

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు