కోవిడ్‌ ఎఫెక్ట్‌... ఆరోగ్య బీమా జోరు!

3 Dec, 2020 00:35 IST|Sakshi

14 శాతం వృద్ధి సాధించిన పరిశ్రమ

వాహన బీమా విభాగాన్ని దాటిన హెల్త్‌

ఇండివిడ్యువల్‌ పాలసీలదే హవా

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కోవిడ్‌–19 పుణ్యమాని భారత్‌లో ఆరోగ్య బీమా పాలసీలు ఒక్కసారిగా పెరిగాయి. ఆసుపత్రి ఖర్చులకు భయపడ్డ ప్రజలు ప్రైవేటు బీమా కంపెనీల వద్దకు పరుగెత్తారు. అటు ఐఆర్‌డీఏఐ చొరవతో బీమా కంపెనీలు కరోనా కవచ్‌ పేరుతో ప్రత్యేక పాలసీలను సైతం ఆఫర్‌ చేశాయి. దీంతో 2020 ఏప్రిల్‌–సెప్టెంబర్‌లో నాన్‌–లైఫ్‌ బీమా కంపెనీలు వసూలు చేసిన మొత్తం ప్రీమియంలో హెల్త్‌ ఇన్సూరెన్స్‌ వాటా దూసుకెళ్లి 29.7 శాతం కైవసం చేసుకుంది.

గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 15.8 శాతం అధికం. ఇక మోటార్‌ ఇన్సూరెన్స్‌ వాటా 13.8% తగ్గి 29%కి పరిమితమైంది. నాన్‌–లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సెగ్మెంట్లో ఆరోగ్య బీమా గత 2 దశాబ్దాల్లో తొలిసారి గా వాహన బీమా విభాగాన్ని దాటడం గమనార్హం. 2014–15లో ఆరోగ్య బీమా వాటా 23.4%, మోటార్‌ విభాగం వాటా 44.4% నమోదైంది. ఈ ఏడాది సెప్టెంబరుతో ముగిసిన ఆరు నెలల కాలంలో వృద్ధి పరంగా ఫైర్‌ విభాగం 33.5 శాతంతో తొలిస్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానంలో ఆరోగ్య బీమా వచ్చి చేరింది.

ఇండివిడ్యువల్‌ పాలసీలే అధికం..
వాస్తవానికి ఆరోగ్య బీమా రంగంలో గ్రూప్‌ పాలసీలదే హవా. ఈసారి మాత్రం ఇండివిడ్యువల్స్‌ నుంచి దరఖాస్తులు ఎక్కువయ్యాయి. గతేడాదితో పోలిస్తే ఇండివిడ్యువల్‌ పాలసీల ప్రీమియం 2020 ఏప్రిల్‌–సెప్టెంబర్‌లో 34 శాతం అధికమైతే, గ్రూప్‌ పాలసీల వృద్ధి 16 శాతానికే పరిమితమైంది. దీంతో హెల్త్‌ ప్రీమియంలో ఇండివిడ్యువల్‌ పాలసీల శాతం 36 నుంచి 41 శాతానికి చేరింది. అయితే నాన్‌–లైఫ్‌ విభాగంలో పోటీ పడుతున్న 32 సంస్థల్లో 23 కంపెనీలు వృద్ధిని నమోదు చేశాయి. హెల్త్‌ విభాగంలో దిగ్గజ కంపెనీ న్యూ ఇండియా అష్యూరెన్స్‌ కేవలం 5 శాతం వృద్ధి సాధించింది. యునైటెడ్‌ ఇండియా అష్యూరెన్స్‌ 57.9 శాతం, స్టార్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ 45.6 శాతం వృద్ధిని దక్కించుకున్నాయి. 2014–15 నుంచి 2018–19 మధ్య కంపెనీలు వసూలు చేసిన ప్రతి రూ.100 ప్రీమియంలో క్లెయిమ్స్‌ కింద సగటున రూ.96 చెల్లించాయి. అదే మోటార్‌ విభాగంలో రూ.84, ఫైర్‌ సెగ్మెంట్లో రూ.81 చెల్లించాయి.

మహమ్మారి కారణంగా..
జూలై 2017–జూన్‌ 2018 మధ్య చేపట్టిన నేషనల్‌ శాంపిల్‌ సర్వే ప్రకారం దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో 85.9%, పట్టణాల్లో 80.9% మందికి బీమా పాలసీలు లేవని గణాంకాలు చెబుతున్నాయి. ఆరోగ్య బీమా ప్రయోజనాల పట్ల అవగాహన లేకపోవడమే ఇందుకు కారణమని మణిపాల్‌సిగ్నా హెల్త్‌ ఇన్సూరెన్స్‌    సీఈవో ప్రసూన్‌ సిక్దర్‌ సాక్షి బిజినెస్‌ బ్యూరోకు తెలిపారు. ‘కోవిడ్‌–19తో ఆరోగ్య బీమా తప్పనిసరన్న భావన ప్రజల్లో వచ్చింది. ఆరోగ్య బీమా పరిశ్రమ (పర్సనల్‌ యాక్సిడెంట్‌తో కలిపి) ఈ ఏడాది ఏప్రిల్‌–సెప్టెంబర్‌లో 14% వృద్ధి చెంది రూ.31,132 కోట్ల ప్రీమియం వసూలైంది. మణిపాల్‌సిగ్నా 30% వృద్ధితో రూ.329 కోట్ల ప్రీమియం పొం దింది. రానున్న రోజుల్లో పరిశ్రమ సానుకూలంగా ఉంటుంది’ అని చెప్పారు. కాగా, బీమా కంపెనీలకు రూ.8,000 కోట్ల విలువైన కోవిడ్‌–19 క్లెయిమ్స్‌ వచ్చినట్టు తెలుస్తోంది. ఇందులో రూ.3,500 కోట్ల విలువైన క్లెయిమ్స్‌ సెటిల్‌ అయ్యాయని సమాచారం.

 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు