పెద్దలకు పరిపూర్ణ రక్షణ

7 Sep, 2020 04:14 IST|Sakshi

హెల్త్‌ ఇన్సూరెన్స్‌ తప్పకుండా తీసుకోవాలి

తగినంత కవరేజీ అవసరం

కంపెనీ ఇన్సూరెన్స్‌ ఉన్నా విడిగా పాలసీ తీసుకోవాలి

వృద్ధాప్యంలో ప్రత్యేకంగా వైద్య అత్యవసర నిధి

పాలసీలో చెల్లించని ఖర్చుల కోసం ఇది అవసరం

50 ఏళ్లు వచ్చే సరికి బీమా ఉండేలా చూసుకోవాలి

మన దేశ జనాభాలో వృద్ధులు (సీనియర్‌ సిటిజన్లు) 2015 నాటికి 8 శాతానికి చేరారు. 2050 నాటికి 19 శాతం వృద్ధులే ఉంటారని అంచనా. ప్రతీ ఇంటిలోనూ 60 ఏళ్లు నిండిన వయసు వారు ఆ కుటుంబానికి ఓ పెద్ద ఆస్తి వంటివారే. కుటుంబం కోసం అప్పటి వరకు వారు ఎంతో పాటు పడి, ఎంతో శ్రమకోర్చి ఉంటారు. కానీ, వృద్ధాప్యంలో వారిని చుట్టుముట్టే ఆరోగ్య, జీవనశైలి సమస్యలెన్నో. వీటి కోసం చేయాల్సిన ఖర్చు కొన్ని సందర్భాల్లో భారీగానూ ఉంటుంది. వయసుతోపాటు పెరిగే ఆరోగ్య సంరక్షణ వ్యయాలకు ప్రతీ కుటుంబం తగినంత సన్నద్ధతతో ఉండాలి.

అయితే, సీనియర్‌ సిటిజన్లు, వారి పిల్లలు హెల్త్‌ కవరేజీ విషయంలో తగినంత రక్షణతో లేనట్టు ఆదిత్య బిర్లా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఇటీవల నిర్వహించిన సర్వే ద్వారా తెలిసింది. ‘‘ఉమ్మడి కుటుంబాలు కాస్తా ఏక కుటుంబంగా మారుతున్న రోజుల్లో.. పిల్లలు పెద్ద పట్టణాలకు, విదేశాలకు జీవనోపాధి కోసం తరలిపోతుండడంతో పెద్దల జీవనం, వారి సంరక్షణ సవాలుగా మారుతున్నాయి’’ అని ఆదిత్య బిర్లా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ సీఈవో మయాంక్‌ భత్వాల్‌ పేర్కొన్నారు. ఈ క్రమంలో వృద్ధాప్యంలో సంక్షేమం, ఆరోగ్యం కోసం అవసరమైన చర్యలను ముందు నుంచే తీసుకోవడం ద్వారా నిశ్చితంగా ఉండొచ్చు. ఇందుకోసం వైద్య బీమా తీసుకోవడంతోపాటు ఇతరత్రా చర్యలు కూడా అవసరమేనని సూచించే కథనమే ఇది.

ఆరోగ్య అత్యవసర నిధి
50 ఏళ్లకు వచ్చిన వారికి పదవీ విరమణ తీసుకునేందుకు మరో 10 ఏళ్ల వరకు సమయం మిగిలి ఉంటుంది. ఈ కాలాన్ని వైద్య అత్యవసర నిధి సమకూర్చుకునేందుకు వినియోగించుకోవాలి. ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల్లో సిప్‌ రూపంలో పదేళ్ల పాటు ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా అవసరమైనంత నిధిని సమకూర్చుకోవచ్చని సెబీ రిజిస్టర్డ్‌ పెట్టుబడి సలహాదారులు రేణు మహేశ్వరి సూచించారు. హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఉన్నప్పటికీ తన వంతుగా రోగి చెల్లించాల్సి వస్తే అందుకోసం వైద్య అత్యవసర నిధి అక్కరకు వస్తుంది. అవుట్‌ పేషెంట్‌గా తీసుకునే చికిత్సలకు పాలసీలు అన్నింటిలోనూ కవరేజీ ఉండకపోవచ్చు. కనుక అవుట్‌ పేషెంట్‌ వైద్య సేవలకు చేసే చెల్లింపులు, ఆస్పత్రికి రాను, పోను చార్జీలు ఇవన్నీ రోగి తన పాకెట్‌ నుంచే పెట్టుకోవాల్సి రావచ్చు.  ఒక్కసారి నిధిని సిద్ధం చేసుకున్న తర్వాత.. మొత్తాన్ని ఒకే చోట కాకుండా.. సేవింగ్స్‌ డిపాజిట్, లిక్విడ్‌ ఫండ్స్, అల్ట్రా షార్ట్‌ టర్మ్‌ డెట్‌ ఫండ్స్, ఫిక్స్‌డ్‌ డిపాజిట్స్‌ రూపంలో ఉంచుకోవాలి.

గ్రూపు హెల్త్‌ ఇన్సూరెన్స్‌లో చోటు
ఉద్యోగం చేసే చోట గ్రూపు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కవరేజీని సంస్థ ఆఫర్‌ చేస్తుంటుంది. ఇందులో తమ తల్లిదండ్రుల పేర్లను కూడా యాడ్‌ చేసుకోవడం మంచి నిర్ణయం అవుతుంది. ఎందుకంటే సాధారణంగా గ్రూప్‌ హెల్త్‌ కవరేజీలో ప్రీమియం కొంచెం తక్కువగా ఉంటుంది. ముందు నుంచే తల్లిదండ్రులను యాడ్‌ చేసుకోవడం ద్వారా ప్రీమియం భారం తక్కువగా ఉండేలా చూసుకోవచ్చు. దీనికి తోడు తల్లిదండ్రులకు విడిగా హెల్త్‌ కవరేజీ కూడా తీసుకోవాలి. ‘‘చాలా కార్పొరేట్‌ సంస్థలు తల్లిదండ్రులకు దీర్ఘకాలం పాటు కవరేజీని ఆఫర్‌ చేయడం లేదు. అందుకే ముందు తల్లిదండ్రులను గ్రూపు హెల్త్‌ ఇన్సూరెన్స్‌లో చేర్చుకున్నా కానీ, కొన్ని సంవత్సరాల తర్వాత ఖర్చులను తగ్గించుకునేందుకు తొలగించాల్సి రావచ్చు. పైగా ఈ పాలసీల్లో పెద్దలకు కవరేజీ తక్కువగా రూ.2–3 లక్షల వరకే ఉంటుంది. ఉద్యోగం మానివేసినా, లేక సంస్థ మారినా ఈ కవరేజీని కోల్పోవాల్సి వస్తుంది’’ అని నిపుణులు పేర్కొంటున్నారు.

అవసరమైన కవరేజీ..
వయసు పెరుగుతున్న కొద్దీ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియం అధికమవుతుంది.  ‘‘మెట్రో నగరంలోనా లేక చిన్న పట్టణంలో నివసిస్తున్నారా?, మీ జీవన శైలి, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులు.. వీటి ఆధారంగా ఎంత మేర సమ్‌ ఇన్సూర్డ్‌ (బీమా మొత్తం) తీసుకోవాలన్నది ఆధారపడి ఉంటుంది’’ అని మణిపాల్‌ సిగ్నా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఎండీ ప్రసూన్‌ సిక్‌దర్‌ తెలిపారు. మెట్రోలో ఉంటున్న వారు, ఆస్పత్రిలో సింగిల్‌రూమ్‌ కోరుకునే వారు అధిక కవరేజీ తీసుకోవడం అవసరం. వృద్ధ దంపతులకు రూ.10–20 లక్షల కవరేజీ, ఆ వయసులో విడిగా ఒకరికి అయితే రూ.7–10 లక్షల వరకైనా బీమా తీసుకోవాలి.

కఠిన నిబంధనలు
50 ఏళ్లకి వచ్చే సరికి దంపతులు ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్య బీమా కవరేజీ ఉండేలా చూసుకోవాలి. వైద్య బీమా అన్నది తగినంత లేకపోతే సూపర్‌ టాపప్‌ ద్వారా దాన్ని పెంచుకోవాలి. అదే 60 ఏళ్లు నిండిన తర్వాత కొత్తగా హెల్త్‌ పాలసీ తీసుకోవాలన్నా, సమ్‌ ఇన్సూర్డ్‌ మొత్తాన్ని పెంచుకోవాలన్నా లేక సూపర్‌ టాపప్‌ తీసుకోవాలన్నా అది కష్టంగా మారుతుంది. ‘‘ఒక వ్యక్తి 60 ఏళ్ల వయసులోకి ప్రవేశించారంటే వారికి కఠిన అండర్‌రైటింగ్‌ నిబంధనలు అమలవుతాయి. ఉదాహరణకు పాలసీ తీసుకునే ముందు వైద్య పరీక్షలు తప్పనిసరి’’ అని సిక్‌దర్‌ తెలిపారు. ముందస్తు వ్యాధులున్న వారికి బీమా కంపెనీలు బీమాకు నిరాకరిస్తున్నాయి కూడా. సీనియర్‌ సిటిజన్ల కోసం ఉద్దేశించిన పాలసీలు నేడు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. ముందస్తు వ్యాధులకు ఇవి కవరేజీని ఆఫర్‌ చేస్తున్నప్పటికీ.. ఎన్నో పరిమితులను విధిస్తున్నాయి.

వెయిటింగ్‌ పీరియడ్‌ ఆప్షన్లు
పాలసీల్లో రెండు రకాల వెయిటింగ్‌ పీరియడ్‌ ఆప్షన్లు ఉంటుంటాయి. ముందు నుంచీ ఉన్న వ్యాధులకు కవరేజీ ఒకటి. పాలసీ తీసుకున్న అనంతరం రెండు నుంచి నాలుగేళ్లు గడిచిన తర్వాతే వీటికి కవరేజీనిస్తాయి. కేటరాక్ట్, మోకీలు మార్పిడి తదితర  చికిత్సలకు కవరేజీ కోసం పాలసీ తీసుకున్న అనంతరం రెండేళ్ల పాటు ఆగాల్సి రావడం మరొకటి. అంటే ఈ కాలంలో చికిత్సలు చేయించుకోవాల్సి వస్తే అందుకు అయ్యే వ్యయాలను పాలసీదారులే పెట్టుకోవాలి.

ఉప పరిమితులు
బీమా సంస్థలు చెల్లింపుల్లో ఉప పరిమితులను కూడా విధిస్తుంటాయి. అంటే, ఫలానా వ్యాధికి గరిష్టంగా ఇంత మొత్తమని లేదా సమ్‌ ఇన్సూర్డ్‌లో నిర్ణీత శాతాన్ని చెల్లిస్తామన్న నిబంధనలు పాలసీల్లో ఉంటాయి. ఉదాహరణకు గుండె సంబంధిత సమస్యలకు గరిష్టంగా రూ.3 లక్షలే చెల్లిస్తామనే పరిమితి ఉండొచ్చు. అదే కేటరాక్ట్‌ సర్జరీ అయితే గరిష్ట చెల్లింపులను రూ.25,000కు పరిమితం చేస్తాయి. ఒకవేళ ఇంతకు మించి వ్యయం అయితే ఆ మొత్తాన్ని పాలసీదారులే భరించాల్సి ఉంటుంది. అలాగే అన్ని పాలసీల్లో కాకపోయినా కొన్నింటిలో రూమ్‌ రెంట్, ఐసీయూ రెంట్‌ పరంగా ఉప పరిమితులు కూడా ఉంటుంటాయి. ఈ పరిమితులతో మొత్తం పాలసీ చెల్లింపులు కూడా మారిపోతాయి. అందుకే పాలసీ తీసుకునే ముందు పూర్తి అవగాహనకు వచ్చిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి.

ఆదిత్య బిర్లా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ సర్వే అంశాలు
► 18 శాతం తల్లిదండ్రులకే హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కవరేజీ ఉంది. అంటే మెజారిటీకి కవరేజీ లేదు.
► 26 శాతం తల్లిదండ్రులు వైద్య పరంగా అత్యవసర పరిస్థితుల్లో చెల్లింపులకు పిల్లలపైనే ఆధారపడుతున్నారు. అంటే నాలుగింట మూడొంతులు మందికి తగినంత పెట్టుబడులు, పొదుపు నిధుల్లేవు.
► 29 శాతం మంది తమ తల్లిదండ్రులను కంపెనీ లేదా ప్రభుత్వ వైద్య బీమా కవరేజీలో భాగం చేసినట్టు చెప్పారు. వీరికి ప్రత్యేకంగా కవరేజీ అవసరం కూడా ఉంది. 

కొన్ని పాలసీలను చూస్తే...
బీమా కంపెనీ    ప్లాన్‌ పేరు    వార్షిక ప్రీమియం
రెలిగేర్‌ హెల్త్‌    కేర్‌ సీనియర్‌    రూ.39,374
స్టార్‌ హెల్త్‌    సీనియర్‌ సిటిజన్‌ రెడ్‌కార్పెట్‌    రూ.43,135
ఆదిత్యబిర్లాహెల్త్‌    యాక్టివ్‌కేర్‌స్టాండర్డ్‌    రూ.55,598
అపోలోమ్యునిక్‌హెల్త్‌    ఆప్టిమారీస్టోర్‌    రూ.61,312
హెడీఎఫ్‌సీ ఎర్గో    హెల్త్‌సురక్షా గోల్డ్‌స్మార్ట్‌    రూ.65,785  

నోట్‌: మెట్రోలో నివసించే 63 ఏళ్ల వృద్ధుడు, 61 ఏళ్ల ఆయన జీవిత భాగస్వామికి రూ.10 లక్షల కవరేజీ కోసం ప్రీమియం వివరాలు ఇవి..

కో పేమెంట్‌ ఎంత..?
పాలసీల్లో ఎక్కువ వాటిల్లో కో పేమెంట్‌ ఆప్షన్‌ ఉంటోంది.  అంటే వైద్య చికిత్సా వ్యయాల్లో రోగి తన వంతుగా చెల్లించాల్సిన వాటా. ఇది పాలసీలను బట్టి 10–30% మధ్య ఉండొచ్చు.

మరిన్ని వార్తలు