టెక్‌యేతర ఉద్యోగాలకు డిమాండ్‌

30 Jan, 2023 04:20 IST|Sakshi

హెల్త్‌కేర్, నిర్మాణం రంగాల్లో హైరింగ్‌ 

డిసెంబర్‌లో ధోరణులపై ఇన్‌డీడ్‌ నివేదిక

ముంబై: బహుళ జాతి ఐటీ దిగ్గజాలు ఉద్యోగాల్లో కోతలు విధిస్తున్న తరుణంలో గతేడాది డిసెంబర్‌లో దేశీయంగా టెక్‌యేతర రంగాల్లో ఉద్యోగులకు డిమాండ్‌ పెరిగింది. ప్రధానంగా ఆరోగ్య సంరక్షణ, ఆహార సర్వీసులు, నిర్మాణం, విద్యా రంగాల్లో ఈ ధోరణి నెలకొంది. నెలవారీగా ఉద్యోగాల పోస్టింగ్‌లపై అంతర్జాతీయ జాబ్‌ సైట్‌ ఇన్‌డీడ్‌ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం హెల్త్‌కేర్‌ అనుబంధ విభాగాలైన డెంటల్, నర్సింగ్‌ రంగాల్లో ఉద్యోగాల పోస్టింగ్స్‌ అత్యధికంగా 30.8 శాతంగా నమోదయ్యాయి.

ఫుడ్‌ సర్వీసెస్‌ (8.8%), నిర్మాణం (8.3%), ఆర్కిటెక్చర్‌ (7.2%), విద్య (7.1%) థెరపీ (6.3%), మార్కెటింగ్‌ (6.1%) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. కరోనా మహమ్మారి అనంతరం వ్యాపార పరిస్థితులు సాధారణ స్థాయికి తిరిగొస్తున్న నేపథ్యంలో నిర్మాణం, సివిల్‌ ఇంజినీరింగ్‌ వంటి విభాగాల్లో కాస్త సందడి నెలకొందని నివేదిక పేర్కొంది. అలాగే మహమ్మారి సమయంలో భారీగా కోతలు పడిన మార్కెటింగ్‌ విభాగంలోనూ హైరింగ్‌ పుంజుకుందని వివరించింది. కస్టమర్లకు మెరుగైన అనుభూతిని కల్పించడంతో పాటు వ్యాపారం, అమ్మకాలను పెంచుకునేందుకు మార్కెటింగ్‌ అవసరాన్ని బ్రాండ్లు గుర్తించాయని పేర్కొంది.  

బెంగళూరు టాప్‌..
జాబ్‌ పోస్టింగ్స్‌ విషయంలో మొత్తం 16.5 శాతం వాటాతో బెంగళూరు అగ్రస్థానంలో నిల్చింది. ముంబై (8.23%), పుణె (6.33%), చెన్నై (6.1%) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. చిన్న నగరాల్లోను డిమాండ్‌ పెరుగుతోందనడానికి సూచనగా ఉద్యోగాల పోస్టింగ్స్‌లో అహ్మదాబాద్, కోయంబత్తూర్, కొచ్చి, జైపూర్, మొహాలీ వంటి ద్వితీయ శ్రేణి నగరాల వాటా 6.9 శాతంగా నమోదైంది.  ప్రయాణాలపై కోవిడ్‌–19పరమైన ఆంక్షల ఎత్తివేతతో విదేశాల్లో వివిధ రంగాల్లో ఉద్యోగావకాశాలను భారతీయులు గణనీయంగానే అన్వేషిస్తున్నారు.

ఈ విషయంలో దేశాలవారీగా చూస్తే మొత్తం సెర్చ్‌లలో అమెరికా వాటా 39.29 శాతంగా ఉండగా, కెనడా 17.23 శాతం, బ్రిటన్‌ 14.34 శాతం, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరెట్స్‌ 13.79 శాతం వాటాతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి. అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొన్నప్పటికీ దేశీయంగా వివిధ ఉద్యోగాల కేటగిరీల్లో వృద్ధి కనబడుతోందని, భారత్‌లో హైరింగ్‌ ధోరణులు సానుకూలంగా ఉందనడానికి ఇది నిదర్శనమని ఇన్‌డీడ్‌ ఇండియా హెడ్‌ (సేల్స్‌) శశి కుమార్‌ తెలిపారు. కేంద్ర బడ్జెట్‌లో ఉపాధి కల్పనపై దృష్టి పెడితే కచ్చితంగా దేశీయంగా జాబ్‌ మార్కెట్‌కు మరింత ఊతం లభించగలదని ఆయన చెప్పారు. దేశీయంగా ఉద్యోగాల పరిస్థితి ఎలా ఉండబోతోందనేది ఈ ఏడాది తొలి రెండు త్రైమాసికాల్లో ధోరణులే నిర్దేశిస్తాయని పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు