దేశీయంగా తయారీకి ప్రాధాన్యమివ్వండి

27 Aug, 2021 02:45 IST|Sakshi

ఆర్‌అండ్‌డీపై పెట్టుబడులు పెంచండి

కొత్త నైపుణ్యాల్లో శిక్షణ ఇప్పించండి

ఆటో విడిభాగాల సంస్థలకు  కేంద్ర మంత్రి పాండే సూచన

న్యూఢిల్లీ: దేశీయంగా తయారీకి ప్రాధాన్యమివ్వాలని ఆటో విడిభాగాల పరిశ్రమకు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర నాథ్‌ పాండే సూచించారు. క్షేత్రస్థాయిలో స్థానికీకరణపై దృష్టి పెట్టాలని.. పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) కార్యకలాపాలపై మరింతగా ఇన్వెస్ట్‌ చేయాలని పేర్కొన్నారు. అలాగే సిబ్బందికి కొత్త నైపుణ్యాల్లో శిక్షణనిప్పించడంపైనా ఇన్వెస్ట్‌ చేయాలని తెలిపారు. ఆటోమోటివ్‌ విడిభాగాల తయారీ సంస్థల అసోసియేషన్‌ ఏసీఎంఏ 61వ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు పేర్కొన్నారు.

‘‘స్థానికంగా తయారీకి ప్రాధాన్యం లభించాలన్నది ప్రధాని మోదీ ఉద్దేశ్యం. పరిశ్రమ కూడా స్థానికీకరణ ప్రక్రియపై కసరత్తు చేస్తోందని నాకు తెలుసు. సియామ్‌ (వాహనాల తయారీ సంస్థల సమాఖ్య), ఏసీఎంఏ స్థానికీకరణ మార్గదర్శ ప్రణాళికను కూడా రూపొందించాయి. దాన్ని క్షేత్ర స్థాయిలో అమలు చేయాలని పరిశ్రమను కోరుతున్నాను’’ అని ఆయన తెలిపారు. ప్రధానంగా ఎలక్ట్రిక్‌ వాహనాలకు సంబంధించి ఆర్‌అండ్‌డీ కార్యకలాపాలపై మరింతగా ఇన్వెస్ట్‌ చేయాలని పేర్కొన్నారు. ఆటో విడిభాగాల పరిశ్రమకు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 2.3 శాతం వాటా ఉందని, 50 లక్షల మందికి పైగా ఉపాధి కల్పిస్తోందని ఆయన చెప్పారు. ప్రస్తుతం 60 శాతం ఆటో విడిభాగాల ఎగుమతులు ఉత్తర అమెరికా, యూరప్‌ దేశాలకు వెడుతున్నాయని తెలిపారు.

వచ్చే అయిదేళ్లలో 2025–26 నాటికి ఎగుమతులను 30 బిలియన్‌ డాలర్ల స్థాయికి పెంచుకోవాలని ప్రభుత్వం నిర్దేశించుకుందని, తద్వారా అంతర్జాతీయ మార్కెట్లో దేశీ పరిశ్రమ వాటా 3 శాతానికి చేరగలదని వివరించారు. అలాగే 2025 నాటికి ఆటో విడిభాగాల రంగంలో ఉద్యోగాల సంఖ్య 70 లక్షలకు చేరగలదన్నారు.  2021 ఆర్థిక సంవత్సరంలో ఆటోమోటివ్‌ ఎగుమతులు 13 బిలియన్‌ డాలర్లుగా ఉండగా, 1.3 లక్షల కోట్ల డాలర్ల అంతర్జాతీయ మార్కెట్లో భారత్‌కు 1.2 శాతం వాటా ఉంది. ఏసీఎంఏలో 800 పైచిలుకు తయారీ సంస్థలు ఉన్నాయి. వీటికి సంఘటిత ఆటో విడిభాగాల పరిశ్రమ టర్నోవరులో 85 శాతం పైగా వాటా ఉంది. ఎలాంటి టెక్నాలజీలనైనా స్థానికంగా వినియోగంలోకి తెచ్చేందుకు తగినంత సమయం లభించేలా దీర్ఘకాలికమైన, స్థిరమైన మార్గదర్శ ప్రణాళిక అవసరమని ఏసీఎంఏ ప్రెసిడెంట్‌ దీపక్‌ జైన్‌ అభిప్రాయపడ్డారు.

దిగుమతులపై ఆధారపడటం తగ్గాలి: కాంత్‌
దేశీ ఆటోమొబైల్, విడిభాగాల రంగాలు చైనా నుంచి దిగుమతులపై ఆధారపడటం నుంచి పూర్తిగా బైటికి రావాలని నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత్‌ సూచించారు. ఆటో విడిభాగాలు మొదలైన వాటన్నింటినీ దేశీయంగా తయారు చేసుకోవడంపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. ఫేమ్‌ 2 పథకం కింద ఎంపికైన తొమ్మిది నగరాల్లో ఎలక్ట్రిక్‌ బస్సులకు సంబంధించిన ప్రక్రియ పూర్తయిన తర్వాత నాలుగు చక్రాల వాహనాలకు (కార్లు మొదలైన వాటికి) కూడా స్కీమును వర్తింపచేసే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తుందని ఆయన చెప్పారు.

2030 నాటికి కార్లన్నీ ఎలక్ట్రిక్‌: నిస్సాన్‌
వాహన తయారీ రంగంలో భారత్‌లో అపార అవకాశాలు ఉన్నాయని నిస్సాన్‌ మోటార్‌ కార్పొరేషన్‌ తెలిపింది. ఎలక్ట్రిక్‌ వాహన విభాగం కారణంగా పరిశ్రమలో సమూల మార్పులు వస్తాయని కంపెనీ సీవోవో అశ్వని గుప్తా అన్నారు. 2030 నాటికి కంపెనీ కార్లన్నీ ఎలక్ట్రిక్‌ ఆప్షన్స్‌తో ఉంటాయని వెల్లడించారు. ‘భారత వాహన పరిశ్రమ ప్రపంచంలో నాల్గవ స్థానంలో ఉంది. అయిదారేళ్లలో మూడవ స్థానానికి చేరడం ఖాయం. దేశంలో 1,000 మంది జనాభాకు 20 కార్లు మాత్రమే ఉన్నాయి. ఈ అవకాశాన్ని ఎలా చేజిక్కించుకోవాలన్నదే పెద్ద సవాల్‌’ అని అన్నారు.

మరిన్ని వార్తలు