10 నిమిషాల్లో కొత్త పాన్ కార్డ్ 

24 Dec, 2020 19:59 IST|Sakshi

న్యూఢిల్లీ: మీరు ఇప్పుడు పాన్ కార్డు తీసుకోవాలని భావిస్తున్నారా? అయితే మీరు దీని కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఇంట్లో నుండే కేవలం పది నిమిషాల్లో పాన్ కార్డు పొందే సదుపాయాన్ని కేంద్రం కల్పిస్తుంది. ప్రస్తుత పరిస్థితులలో మనకు ఆధార్ కార్డు ఎంత ముఖ్యమో పాన్ కార్డ్ కూడా అంతే ముఖ్యం. ఈ రెండు లేకుండా ఎటువంటి ఆర్థిక లావాదేవీలు పూర్తి చేయలేము. అందుకే ఆదాయ పన్ను శాఖ త్వరితగతిన పాన్ కార్డును పొందేందుకు కొత్త సేవలను ప్రారంభించింది. ప్రస్తుత కోవిడ్-19 సమయంలో బయటికి వెళ్తే ప్రమాదం కాబట్టి ఈ సేవలను తీసుకొచ్చినట్లు ఆదాయ పన్ను శాఖ తెలిపింది.(చదవండి: ‘ఆధార్’ కోసం కొత్త హెల్ప్ లైన్ నెంబర్)  

ఇన్‌స్టంట్ పాన్ సౌకర్యం కింద ఆధార్ కార్డు ద్వారా ఇ-పాన్ కార్డు ఇవ్వడానికి సుమారు 10 నిమిషాలు పడుతుందని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ఈ సౌకర్యం కింద ఇప్పటివరకు సుమారు 7 లక్షల పాన్ కార్డులు జారీచేసినట్లు పేర్కొన్నారు. పాన్ కార్డును ఎస్ఎస్‌డీఎల్, యూటీఐటీఎస్ఎస్ వెబ్‌సైట్స్ ద్వారా కూడా పొందవచ్చు. వీటి ద్వారా అయితే కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అదే ఆదాయపు పన్ను శాఖ పోర్టల్ ద్వారా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేస్తే మీరు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. మీరు ఆదాయ పన్ను శాఖ పోర్టల్ లో https://www.incometaxindiaefiling.gov.in/e-PAN/ మీరు మీ ఆధార్ నెంబర్, ఓటీపీ నెంబర్ ఎంటర్ చేసి ఇకేవైసీ పూర్తి చేస్తే సరిపోతుంది. తర్వాత మీకు పీడీఎఫ్ ఫార్మాట్‌లో పాన్ కార్డ్ లభిస్తుంది. మీరు దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. దింట్లో మీ పేరు, పుట్టిన తేదీ, ఫోటో మొదలైన మీ ముఖ్యమైన సమాచారంతో పాటు QR కోడ్‌ను కలిగి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత మీకు 15-అంకెల రసీదు సంఖ్య లభిస్తుంది. మీ పాన్ కార్డు యొక్క సాఫ్ట్ కాపీ మీ ఇ-మెయిల్ ఐడీకి కూడా పంపబడుతుంది.
     

మరిన్ని వార్తలు