అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఈ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్లు!

3 Dec, 2021 17:32 IST|Sakshi

దేశంలో ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో ప్రత్యామ్నాయంగా మార్కెట్‌లో లభిస్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్లకు మంచి ఆదరణ లభిస్తోంది. ప్రస్తుతం తక్కువ ధరకు మంచి రేంజ్ గల ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్లో లభిస్తున్నాయి. గత ఏడాది కాలంతో పోలిస్తే ఈ ఏడాది ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు కూడా భారీగా పెరిగాయి. ఈ ఏడాది ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలలో ప్రముఖ కంపెనీకి చెందిన ఈ-స్కూటర్లు భారీగా అమ్ముడవుతున్నాయి. 'భారతదేశంలో అత్యధికంగా అమ్ముడుపోతున్న ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ' అనే బిరుదును హీరో ఎలక్ట్రిక్ ఇటీవల దక్కించకుంది. 

హీరో ఎలక్ట్రిక్:
దేశంలో అతిపెద్ద ఎలక్ట్రిక్ టూ వీలర్ కంపెనీ అయిన హీరో ఎలక్ట్రిక్ ఇప్పటివరకు నాలుగు లక్షలకు పైగా ఎలక్ట్రిక్ వాహనలను విక్రయించినట్లు తెలిపింది. భారతదేశ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో 36 శాతం మార్కెట్ వాటా ఈ కంపెనీ కలిగి ఉంది. సోలార్, విండ్ & ఎలక్ట్రిక్ మొబిలిటీ సెగ్మెంట్ పరిశోధన సంస్థ జెఎంకె రీసెర్చ్ అండ్ ఎనలిటిక్స్ ఇటీవల ఒక సర్వేను చేపట్టింది. ఆ సర్వేలో హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లు అమ్మకాల పరంగా భారతదేశంలో మొదటి స్థానంలో నిలిచాయి. కరోనావైరస్ మహమ్మారి వల్ల మార్కెట్లో మందగమనం ఏర్పడినప్పటికి ఈ ఏడాది దేశంలోని ప్రధాన కేంద్రాల్లో గరిష్ట సంఖ్యలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను విక్రయించినట్లు కంపెనీ పేర్కొంది. 

జనవరి 2021 నుంచి ఈవీ తయారీదారు హీరో ఎలక్ట్రిక్ 65,000కు పైగా స్కూటర్లను విక్రయించింది. హీరో ఎలక్ట్రిక్ సంస్థకు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 700 డీలర్ షిప్లు, 2000 ఈవి ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. త్వరలో భారతదేశంలో మరో 20,000 ఈవి ఛార్జింగ్ స్టేషన్లను లాంచ్ చేయనున్నట్లు తెలిపింది. కంపెనీ తన తయారీ సామర్ధ్యాన్ని కూడా విస్తరిస్తుంది. 2025 నాటికి ఏడాదిలో 1 మిలియన్ ఈవీలను తయారు చేయాలని యోచిస్తోంది.

(చదవండి: వర్క్‌ఫ్రమ్‌ హోం.. గూగుల్‌ గుడ్‌న్యూస్‌)

మరిన్ని వార్తలు