జోరందుకున్న హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలు

3 Nov, 2021 18:21 IST|Sakshi

భారతదేశంలోని అతిపెద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీసంస్థ హీరో ఎలక్ట్రిక్ అక్టోబర్ నెలలో గణనీయంగా అమ్మకాలు జరిపింది. గత నెలలో తన 6,366 హైస్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్లను సేల్ చేసినట్లు కంపెనీ తెలిపింది. సెప్టెంబర్ నెలలో 6,500 యూనిట్లను విక్రయించింది. గత ఏడాది అమ్మకాల(314 యూనిట్లు)తో పోలిస్తే ఈ ఏడాది అమ్మకాలు 1900 శాతం ఎక్కువగా పెరిగాయి. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో మొత్తం అమ్మకాలు 50,331 యూనిట్లకు చెరినట్లు హీరో ఎలక్ట్రిక్ తెలిపింది.

హీరో ఎలక్ట్రిక్ సీఈఓ సోహిందర్ గిల్ మాట్లాడుతూ.. "వినియోగదారులకు 50,000 బైక్ లను డెలివరీ చేయడం మాకు సంతోషంగా ఉన్నప్పటికీ, డెలివరీల కోసం వెయిటింగ్ జాబితాలో ఉన్న మరో 16,500 మంది కస్టమర్లకు మేము క్షమాపణ చెప్పాలి. పెరుగుతున్న డిమాండ్లకు తగ్గట్టు రాబోయే రోజుల్లో వాహన డెలివరీ చేయడానికి సంస్థ తన సామర్థ్యాలను పెంచాలని చూస్తోందని" ఆయన అన్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీని ఐదు లక్షల యూనిట్ల వరకు విస్తరించనున్నట్లు కంపెనీ ఇంతకు ముందు తెలిపింది.

(చదవండి: ఎలక్ట్రిక్ వాహనదారులకు ఐఓసీఎల్ గుడ్‌న్యూస్‌!)

హైస్పీడ్ కేటగిరీలో హీరో ఎలక్ట్రిక్ సిటీ స్పీడ్ స్కూటర్లు ఆప్టిమా, ఎన్ వైఎక్స్ అమ్మకాలు జోరందుకున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి జూలై మధ్య కాలంలో ఈ రెండు ఎలక్ట్రిక్ హైస్పీడ్ స్కూటర్లు భారత్ అంతటా 15,000 అమ్ముడయ్యాయి. డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా 10,000 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ తెలిపింది. ప్రస్తుతం దేశం అంతటా 1650 ఛార్జింగ్ స్టేషన్లను హీరో ఎలక్ట్రిక్ కలిగి ఉంది.

మరిన్ని వార్తలు