హీరో ఎలక్ట్రిక్‌ కొత్త ప్లాంటు

16 Mar, 2023 06:27 IST|Sakshi

రూ.1,200 కోట్ల పెట్టుబడి

మూడు మోడళ్లు విడుదల

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఎలక్ట్రిక్‌ వాహన రంగంలో ఉన్న హీరో ఎలక్ట్రిక్‌ నూతన ప్లాంటును రాజస్థాన్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 20 లక్షల యూనిట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో రూ.1,200 కోట్ల పెట్టుబడితో ఇది రానుంది. లుధియానా వద్ద నెలకొల్పుతున్న ప్లాంటు నిర్మాణ దశలో ఉంది. మధ్యప్రదేశ్‌లోని పీతాంపుర వద్ద ఉన్న మహీంద్రా గ్రూప్‌ ప్లాంటును వినియోగించుకునేందుకు ఆ సంస్థతో ఇప్పటికే భాగస్వామ్యం ఉంది.

ప్రస్తుతం హీరో ఎలక్ట్రిక్‌ వార్షిక తయారీ సామర్థ్యం 5 లక్షల యూనిట్లు. 2022–23లో ఒక లక్ష యూనిట్లు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 2.5 లక్షల యూనిట్ల విక్రయాలను కంపెనీ ఆశిస్తోంది. దేశంలో ఈవీలకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి భాగస్వాములతో కలిసి పనిచేస్తునట్టు హీరో ఎలక్ట్రిక్‌ ఎండీ నవీన్‌ ముంజాల్‌ తెలిపారు. రెండు మూడేళ్లలో 10 లక్షల యూనిట్ల అమ్మకం స్థాయికి చేరతామని ఆశాభావం వ్యక్తం చేశారు. 15 ఏళ్లలో కంపెనీ ఇప్పటి వరకు 6 లక్షల ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలను విక్రయించింది.  

మూడు కొత్త మోడళ్లు..  
హీరో ఎలక్ట్రిక్‌ తాజాగా కొత్త ఆప్టిమా సీఎక్స్‌5.0 (డ్యూయల్‌ బ్యాటరీ), ఆప్టిమా సీఎక్స్‌2.0 (సింగిల్‌ బ్యాటరీ), ఎన్‌వైఎక్స్‌ (డ్యూయల్‌ బ్యాటరీ) మోడళ్లను ప్రవేశపెట్టింది. ధర రూ.85 వేల నుంచి రూ.1.3 లక్షల వరకు ఉంది. జపనీస్‌ మోటార్‌ టెక్నాలజీ, జర్మన్‌ ఈడీయూ సాంకేతికతతో ఇవి తయారయ్యాయి. బ్యాటరీ సేఫ్టీ అలారమ్, డ్రైవ్‌ మోడ్‌ లాక్, రివర్స్‌ రోల్‌ ప్రొటెక్షన్, సైడ్‌ స్టాండ్‌ సెన్సార్‌ వంటి హంగులు ఉన్నాయి. 3 కిలోవాట్‌ అవర్‌ సీ5 లిథియం అయాన్‌ బ్యాటరీతో ఆప్టిమా సీఎక్స్‌5.0 తయారైంది. ఒకసారి చార్జింగ్‌తో 113 కిలోమీటర్లు పరుగెడుతుంది. గంటకు 55 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఒకసారి చార్జింగ్‌తో ఎన్‌వైఎక్స్‌ 113 కిలోమీటర్లు, సీఎక్స్‌2.0 మోడల్‌ 89 కిలోమీటర్లు వెళ్తుంది. ఈ రెండు మోడళ్లూ గంటకు 48 కిలోమీటర్ల వేగంతో పరుగెడతాయి.

మరిన్ని వార్తలు