చార్జర్‌తో హీరో ఎలక్ట్రిక్‌ జట్టు 

17 Nov, 2021 03:59 IST|Sakshi

మూడేళ్లలో లక్ష చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటు  

న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్‌ వాహనాల చార్జింగ్‌ సదుపాయాల సంస్థ చార్జర్‌తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు విద్యుత్‌ వాహనాల సంస్థ హీరో ఎలక్ట్రిక్‌ వెల్లడించింది. దీని ప్రకారం వచ్చే మూడేళ్లలో దేశవ్యాప్తంగా 1 లక్ష చార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. తొలి ఏడాదిలో టాప్‌ 30 నగరాల్లో చార్జర్‌ 10,000 చార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేస్తుందని హీరో ఎలక్ట్రిక్‌ సీఈవో సోహీందర్‌ గిల్‌ వివరించారు.

వినియోగదారుల సౌకర్యార్ధం హీరో ఎలక్ట్రిక్‌ డీలర్‌షిప్‌లలో ఇవి అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. కిరాణా స్టోర్స్, అపార్ట్‌మెంట్‌లు, ఆఫీసులు, మాల్స్‌ మొదలైన చోట్ల విస్తృతమైన చార్జింగ్‌ స్టేషన్ల నెట్‌వర్క్‌ ఏర్పాటు చేస్తున్నట్లు చార్జర్‌ సహ వ్యవస్థాపకుడు సమీర్‌ రంజన్‌ జైస్వాల్‌ తెలిపారు. బెంగళూరు కేంద్రంగా పనిచేసే చార్జర్‌కు హైదరాబాద్, వైజాగ్‌తో పాటు 20 నగరాల్లో కార్యకలాపాలు ఉన్నాయి. 

మరిన్ని వార్తలు