పబ్లిక్‌ ఇష్యూ ద్వారా హీరో ఫిన్‌కార్ప్‌ రూ.4వేల కోట్లు సమీకరణ!

18 Oct, 2023 10:56 IST|Sakshi

ప్రముఖ దిగ్గజ కంపెనీ హిరో మోటోకార్ప్‌  ఆటోమోబైల్‌ రంగంలో సేవలు అందించడంతో పాటు ఫైనాన్స్‌ రంగంలోనూ తన సత్తాచాటేందుకు సిద్ధం అయింది. హీరో మోటోకార్ప్‌ ఆర్థిక సేవల విభాగమైన హీరో ఫిన్‌కార్ప్‌ రూ.4,000 కోట్ల సమీకరణ లక్ష్యంతో 2024లో పబ్లిక్‌ ఇష్యూకు వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పబ్లిక్‌ ఇష్యూపై సలహాలు ఇచ్చేందుకు ఎనిమిది ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకులను సంస్థ ఎంపిక చేసినట్లు సమాచారం. 

ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకుల్లో జేఎం ఫైనాన్షియల్‌, బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా సెక్యూరిటీస్‌, జెఫ్రీస్‌, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌, హెచ్‌ఎస్‌బీసీ సెక్యూరిటీస్‌, యూబీఎస్‌, ఎస్‌బీఐ కేపిటల్‌, హెచ్‌డీఎఫ్‌సీ ఉన్నాయని ఓ  వార్త మీడియాలో ప్రచురించారు. ప్రతిపాదిత ఐపీఓలో భాగంగా కొత్త షేర్ల జారీ, ప్రస్తుత వాటాదార్ల షేర్ల విక్రయం ద్వారా రూ.4,000 కోట్లను సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. హీరో ఫిన్‌కార్ప్‌లో హీరోమోటో కార్ప్‌ సంస్థకు 40 శాతం వాటా ఉంది. ముంజల్‌ కుటుంబం చేతిలో 35-39 శాతం వాటా ఉండగా.. అపోలో గ్లోబల్‌, క్రిస్‌ కేపిటల్‌, క్రెడిట్‌ సూయిజ్‌, హీరో మోటోకార్ప్‌నకు చెందిన కొన్ని డీలర్‌ల సంస్థల వద్ద మిగిలిన వాటా ఉంది. 1991లో హీరో ఫిన్‌కార్ప్‌ బ్యాంకింగేతర ఆర్థిక సేవల కంపెనీగా ఏర్పడింది.
 

మరిన్ని వార్తలు