Hero Motocorp: మరో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డును నమోదుచేసిన హీరో మోటోకార్ప్‌...!

23 Sep, 2021 17:06 IST|Sakshi

భారత అతి పెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ.. హీరో మోటోకార్ప్‌ ఇంటర్నేషనల్‌ జీరో ఎమిషన్స్‌(ఉద్గారాలు) దినోత్సవాన్ని పురస్కరించుకుని గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డును నమోదుచేసింది.  'లార్జెస్ట్‌ ఆన్‌లైన్‌ఫోటో ఆల్భమ్‌’ పేరిట హీరో మోటోకార్ప్‌ ప్రపంచరికార్డును ఆవిష్కరించింది. కర్భన ఉద్గారాలను తగ్గించడం కోసం హీరో మోటోకార్ప్‌ తన వంతుగా ‘హీరో గ్రీన్‌ డ్రైవ్‌’ ద్వారా దేశవ్యాప్తంగా  మొక్కలను నాటే కార్యక్రమాన్ని చేపట్టనుంది.
చదవండి: టెస్లా ఎలక్ట్రిక్‌ కారుకి ఇండియాలో అడ్డం పడుతున్న ‘స్పీడ్‌ బ్రేకర్‌’

హీరో గ్రీన్‌ డ్రైవ్‌ కార్యక్రమంలో భాగంగా సుమారు 1,37,775 మొక్కలను నాటే ఫోటోలతో ‘లార్జెస్ట్‌ ఆన్‌లైన్‌ఫోటో ఆల్భమ్‌’తో హీరో మోటార్‌కార్ప్‌ గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డుకెక్కింది. కంపెనీ గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డును నమోదుచేయడం ఇది రెండోసారి. ఈ సందర్భంగా హీరో మోటోకార్ప్ గ్లోబల్ ప్రొడక్ట్ ప్లానింగ్ అండ్ స్ట్రాటజీ హెడ్ మాలో లే మాసన్ మాట్లాడుతూ.. "100 మిలియన్‌ అమ్మకాల మైలురాయితో ఈ ఏడాది కంపెనీ మరింత ఉత్సాహంగా ప్రారంభమైందని తెలిపారు. అంతేకాకుండా ఒకే రోజులో లక్ష యూనిట్ల విక్రయాలను హీరో మోటోకార్ప్‌ జరిపినట్లు గుర్తుచేశారు. ‘హీరో గ్రీన్‌ డ్రైవ్‌’ కార్యక్రమంతో జీరో ఎమిషన్స్‌పై కంపెనీ కట్టుబడి ఉందని వెల్లడించారు.

గత నెలలో 'అతిపెద్ద మోటార్‌సైకిల్ లోగో' సృష్టించినందుకుగాను హీరో మోటోకార్ప్‌ గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. ఈ అరుదైన ఫీట్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు హీరో మోటోకార్ప్‌ ప్లాంట్‌లో అతిపెద్ద మోటార్‌సైకిల్‌లోగోను సుమారు 1845 స్ప్లెండర్‌ ప్లస్‌ బైక్స్‌నుపయోగించి గిన్నిస్‌ రికార్డును ఆవిష్కరించింది. 
చదవండి: జేమ్స్‌బాండ్‌-007 భాగస్వామ్యంతో స్పెషల్‌ ఎడిషన్‌ బైక్‌..! 

మరిన్ని వార్తలు