హీరో-జీరో జట్టు.. ఎలక్ట్రిక్‌ బైక్‌ల ఉత్పత్తిలో ఇక తిరుగులేదు!

6 Mar, 2023 12:54 IST|Sakshi

దేశీయ ద్విచక్రవాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్‌ అమెరికాకు చెందిన జీరో మోటర్‌సైకిల్స్‌తో జట్టు కట్టింది. ఈ రెండు సంస్థలూ కలిసి ప్రీమియం ఎలక్ట్రిక్‌ మోటార్‌సైకిళ్లను ఉత్పత్తి చేయనున్నాయి. ఈ మేరకు హీరో మోటర్‌ కార్ప్‌.. జీరో మోటర్‌సైకిల్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఎలక్ట్రిక్‌ మోటర్‌ సైకిళ్లు తయారు చేయడంలో నైపుణ్యం ఉన్న జీరో మోటార్ సైకిల్స్‌ సంస్థ ఈ ఒప్పందం ద్వారా ప్రీమియం ఎలక్ట్రిక్‌ ద్విచక్రవాహనాల తయారీలో హీరో సంస్థకు సహకారం అందిస్తుంది.

 

గతేడాది సెప్టెంబర్‌లో జీరో మోటార్‌సైకిల్స్‌ సంస్థలో హీరో ఆటోమొబైల్స్ 60 మిలియన్‌ డాలర్ల మేరకు ఈక్విటీ పెట్టుబడి పెట్టింది. ఈ తాజా ఒప్పందం గురించి హీరో మోటోకార్ప్ చైర్మన్, సీఈవో పవన్ ముంజాల్ మాట్లాడుతూ.. జీరో మోటార్‌సైకిల్స్‌తో తమ భాగస్వామ్యాన్ని కీలకమైన మైలురాయిగా అభివర్ణించారు. ప్రపంచంలో అతిపెద్ద మోటార్‌సైకిల్ తయారీ సంస్థ అయిన హీరో మోటోకార్ప్‌ తమను భాగస్వామిగా ఎంచుకున్నందుకు సంతోషిస్తున్నామని జీరో మోటార్‌సైకిల్స్ సీఈవో శామ్ పాస్చెల్ పేర్కొన్నారు.

 

ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీలో హీరో సంస్థ లక్ష్య సాధనకు ఈ ఒప్పందం మరింత దోహదం చేస్తుంది. హీరో సంస్థ ఇప్పటికే విడా వీ1 పేరుతో ఓ ప్రీమియం ఎలక్ట్రానిక్‌ స్కూటర్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది.  ప్లస్ వెర్షన్ రూ.1.45 లక్షలు, ప్రో వేరియంట్ (ఎక్స్-షోరూమ్, బెంగళూరు) రూ. 1.59 లక్షలుగా ఉంది. ఇది బెంగళూరు, ఢిల్లీ, జైపూర్‌లలో పబ్లిక్ ఛార్జింగ్ సదుపాయాలను కూడా ప్రవేశపెట్టింది. ఈ మూడు నగరాల్లో దాదాపు 300 ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసింది.

ఇదీ చదవండి: వాహనదారులకు షాక్‌! హైవే ఎక్కితే బాదుడే.. పెరగనున్న టోల్‌ చార్జీలు!

మరిన్ని వార్తలు