హీరో మోటోకార్ప్‌ విదా

5 Mar, 2022 06:35 IST|Sakshi

జూలై 1న ఈవీ స్కూటర్‌ ఆవిష్కరణ

చిత్తూరు ప్లాంటులో తయారీ

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్‌ విదా పేరుతో ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ బ్రాండ్‌ను ఆవిష్కరించింది. జూలై 1న అధికారికంగా ఎలక్ట్రిక్‌ వాహనంతో సహా విదా బ్రాండ్‌ కింద భవిష్యత్‌లో ప్రవేశపెట్టబోయే ఉత్పత్తులు, సేవలను పరిచయం చేయనున్నట్టు వెల్లడించింది. దుబాయి వేదికగా మార్చి 3న సాయంత్రం ఈ కార్యక్రమం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ చిత్తూరులో ఉన్న కంపెనీ ప్లాంటులో విదా మోడల్స్‌ ఉత్పత్తిని చేపట్టనున్నారు. ఏడాది చివర్లో డెలివరీలు ప్రారంభం కానున్నాయని కంపెనీ తెలిపింది.

హీరో మోటాకార్ప్‌ ఈ సందర్భంగా రూ.760 కోట్ల ఫండ్‌ను ప్రకటించింది. పర్యావరణం, సామాజిక, పాలన విభాగాల్లో దేశవ్యాప్తంగా 10,000 మంది ఔత్సాహిక వ్యాపారవేత్తలను ప్రోత్సహించనున్నట్టు వెల్లడించింది. ‘విదా అంటే జీవితం. ప్రపంచంపై సానుకూల ప్రభావాన్ని సృష్టించడం, మనందరినీ అర్థ్ధవంతమైన మార్గాల్లో ముందుకు తీసుకెళ్లడం బ్రాండ్‌ ఏకైక ఉద్దేశం. మేము, మా పిల్లలు, తరువాతి తరం కోసం నిర్మిస్తున్న వాటికి ఈ పేరు సరైనదని నమ్ముతున్నాం. కేవలం 17 వారాల్లో ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చడానికి మా విదా ప్లాట్‌ఫామ్, ఉత్పత్తులు, సేవలను ఆవిష్కరిస్తాం’ అని హీరో మోటోకార్ప్‌ చైర్మన్, సీఈవో పవన్‌ ముంజాల్‌   తెలిపారు. జూలై 1న హీరో గ్రూప్‌ వ్యవస్థాపకులు బ్రిజ్‌మోహన్‌ లాల్‌ ముంజాల్‌ జయంతి.  

మరిన్ని వార్తలు