Hero Motocorp Electric Scooter: ‘హీరో’ ఆఖరికి నువ్వు కూడా ఇంతేనా?!

2 Jun, 2022 21:25 IST|Sakshi

దేశమంతటా ప్రజలు ఎలక్ట్రిక్‌ వాహనాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తు‍న్నారు. ప్రభుత్వాలు సైతం రాయితీలు, ప్రోత్సహకాలు ప్రకటిస్తు‍న్నాయి. అంతా బాగానే ఉన్నా..  ప్రముఖ కంపెనీల నుంచి మాత్రం ఎలక్ట్రిక్‌ వాహనాలు రావడం లేదు. ముఖ్యంగా టూవీలర్‌ సెగ్మెంట్‌లో ఈ సమస్య ఉంది. ఇప్పటికే టీవీఎస్‌, బజాజ్‌, ఓలాలు మార్కెట్‌లోకి వచ్చినా అందరి చూపు దేశీ టూ వీలర్‌ రారాజు హీరో మోటార్‌ కార్ప్‌ నుంచి రాబోతున్న విడా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ మీదనే ఉంది.

ఫస్ట్‌లుక్‌
ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ మార్కెట్‌కి ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని హీరో సంస్థ విడా పేరుతో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఇండియన్‌ మార్కెట్‌లోకి తేబోతున్నట్టు గతేడాది ప్రకటించింది. హీరో పదో వార్షికోత్సవం సందర్భంగా పవన్‌ ముంజాల్‌ విడా పక్కన నిల్చుని వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొని అంచనాలను రెట్టింపు చేశారు. 

ముందుగా జులై
హీరో విడాకు సంబంధించి ఫస్ట్‌ లుక్‌ బయటకు వచ్చినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ఆ స్కూటర్‌ వస్తుందా? ఎప్పుడు సొంతం చేసుకుందామా? అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. చివరకు 2022 జులైలో ఈ స్కూటర్‌ను రిలీజ్‌ చేయబోతున్నట్టు ఫీలర్‌ వదిలింది హీరో. ఇండియన్‌ టూ వీలర్‌ సెగ్మెంట్‌లో తిరుగులేని హీరో నుంచి ప్రకటన పట్ల పోటీ సంస్థలు ఆసక్తి చూపించాయి.

సారీ ఫ్యాన్స్‌
ఎలక్ట్రిక్‌ స్కూటర్‌పై పెట్టుకున్న ఆశలపై చివరకు నీళ్లు గుమ్మరించింది హీరో మోటార్‌ కార్ప్‌. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల కారణంగా సరఫరా వ్యవస్థలో ఇబ్బందులు తలెత్తాయని చెబుతూ 2022 జులైలో హీరో విడా రావడం లేదంటూ ప్రకటించింది.

నిరాశ పరచం
స్కూటర్‌ తయారీలో ఉపయోగించే కాంపోనెంట్స్‌ కొరత కారణంగా సకాలంలో విడా మార్కెట్‌లోకి రావడం లేదంటూ హీరో మోటార్‌ కార్ప్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ కస్బేకర్‌ ప్రకటించారు. ఎప్పుడు మార్కెట్‌లోకి వచ్చినా విడాపై అభిమానులు పెట్టుకున్న అంచనాలను వమ్ము చేయబోమంటూ తెలిపారు.

చదవండి:  బిజినెస్‌ ‘బాహుబలి’ భవీశ్‌

మరిన్ని వార్తలు