హీరో మోటోకార్ప్‌ ప్రియులకు తీపికబురు

16 May, 2021 16:58 IST|Sakshi

దేశీయ ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి అడుగుపెట్టినట్లు పేర్కొంది. వచ్చే ఏడాది హీరో సంస్థకు చెందిన ఒక ఎలక్ట్రిక్ మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు కంపెనీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఎలక్ట్రిక్ వెహికల్(ఈవి) కోసం కంపెనీ తన స్వంత టెక్నాలజీతో ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి జైపూర్(రాజస్థాన్), స్టీఫన్స్కిర్చేన్ (జర్మనీ) ఆర్ అండ్ డీ కేంద్రాల సేవలను వినియోగించుకొనున్నట్లు పేర్కొంది. 

అంతేకాకుండా, బ్యాటరీ స్వాపింగ్‌(బ్యాటరీ ఇచ్చి ఛార్జైన బ్యాటరీ తీసుకోవడం) ప్లాట్‌ఫామ్‌ను భారత్‌కు తీసుకొచ్చేందుకు తైవాన్‌కు చెందిన గోగోరో ఇంక్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొంది. హీరో-బ్రాండ్‌ పేరు మీద మార్కెట్లోకి ఎలక్ట్రిక్ వాహనాలు తీసుకురావడానికి రెండు సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. 2022 నాటికి ఎలక్ట్రిక్‌ వాహనాన్ని తీసుకురానున్నట్లు నిరంజన్‌ గుప్తా వెల్లడించారు. అది మా స్వంత ఉత్పత్తి లేదా గోగోరో సహకారంతో అయిన కావొచ్చని పేర్కొన్నారు. ఈ వాహనాలు వచ్చే ఏడాదిలో ఎప్పుడైన రావొచ్చు అని తెలిపారు. ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఇప్పటికే బెంగళూరుకు చెందిన ఈవీ స్టార్టప్ ఈథర్ ఎనర్జీలో పెట్టుబడులు పెట్టింది. ఈథర్ ఎనర్జీకి చెందిన పలు మోడళ్లు ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

చదవండి:

సింగిల్ చార్జ్ తో 240 కి.మీ ప్రయాణించనున్న ఎలక్ట్రిక్ స్కూటర్

మరిన్ని వార్తలు