రూ. 1000 కోట్ల బోగస్‌ ఖర్చులు..పన్ను ఆదా కోసం తారుమారు లెక్కలు...!

29 Mar, 2022 17:50 IST|Sakshi

ప్రముఖ టూవీలర్‌ దిగ్గజం హీరో మోటోకార్ప్‌పై ఐటీ శాఖ దాడులను జరిపిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో పలు డాక్యుమెంట్లను ఐటీ శాఖ స్వాధీనం చేసుకుంది. హీరో మోటోకార్ప్‌, కంపెనీ  ఎండీ పవన్‌ ముంజల్‌ పలు నిబంధనలను ఉల్లంఘించినట్లు ఐటీ శాఖ గుర్తించింది. 

బోగస్‌ ఖర్చులు..
ఢిల్లీ ఎన్‌సిఆర్‌లోని పలు ప్రదేశాలలో మార్చి 23 నుంచి మార్చి 26 వరకు హీరో మోటోకార్ప్, సంస్థ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పవన్ ముంజాల్‌పై  ఆదాయపు శాఖ సోదాలను నిర్వహించింది. 40 కంటే ఎక్కువ ప్రాంతాల్లో ఐటీ దాడులు జరిగాయి.  సోదాల్లో భాగంగా సంస్థ కార్యకలాపాలకు సంబంధించి హార్డ్ కాపీ డాక్యుమెంట్లు, డిజిటల్ డేటా రూపంలో పెద్ద సంఖ్యలో నేరారోపణలకు సాక్షాలను ఐటీ శాఖ స్వాధీనం చేసుకుంది.  ఈ దాడుల్లో హీరో మోటోకార్ప్‌ సంస్థ సుమారు రూ. 1000 కోట్లకు పైగా బోగస్‌ ఖర్చులను చేసినట్లు ఐటీ శాఖ గుర్తించింది. 

చట్టం ఉల్లంఘన..!
ఐటీ చట్టంలోని సెక్షన్‌ 269 ఎస్‌ఎస్‌ను పవన్‌ ముంజల్‌ ఉల్లంఘించినట్లు తెలుస్తోంది. గతంలో ముంజల్ ఛత్తర్‌పూర్‌లో ఫామ్‌హౌస్‌ను కొనుగోలు చేశాడు. పన్ను ఆదా కోసం ఫామ్‌హౌస్  కొనుగోలుపై మార్కెట్ ధరను తారుమారు చేసి, సుమారు రూ. 100 కోట్ల కంటే ఎక్కువ నగదు చెల్లించడానికి నల్లధనాన్ని ఉపయోగించాడని సమాచారం.  ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 269ఎస్​ఎస్ ప్రకారం స్థిరాస్థి లావాదేవీల్లో రూ.20వేలు అంతకంటే ఎక్కువ నగదు రూపంలో స్వీకరిస్తే శిక్షను విధిస్తారు. ఐటీ శాఖ పలు కీలక విషయాలను బహిర్గతం చేయడంతో హీరో మోటోకార్ప్‌ షేర్లు సుమారు 8 శాతం మేర తగ్గాయి. 

చదవండి: టాక్స్‌ పేయర్లకు అలర్ట్‌..! ఏప్రిల్‌ 1 నుంచి కొత్త రూల్స్‌..!

మరిన్ని వార్తలు