హీరో మోటోకార్ప్‌ డిజిటల్‌ రైడ్‌

20 Jul, 2023 06:24 IST|Sakshi

ఆన్‌లైన్‌ అమ్మకాలు 30 శాతం

2030 నాటికి కంపెనీ లక్ష్యమిది

వెల్లడించిన పవన్‌ ముంజాల్‌

న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్‌ 2030 నాటికి డిజిటల్‌ వేదిక ద్వారా 30 శాతం అమ్మకాలను సాధించాలని లక్ష్యంగా చేసుకుంది. అలాగే మహిళా ఉద్యోగుల సంఖ్యను 30 శాతానికి చేర్చాలని నిర్ణయించామని హీరో మోటోకార్ప్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ పవన్‌ ముంజాల్‌ తెలిపారు. 2022–23 కంపెనీ వార్షిక నివేదికలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు. ‘డిజిటల్‌ వేదికలను పెంపొందించాం. కొనుగోళ్లకు ముందు, తర్వాతి అవసరాలకు ప్రధాన గమ్యస్థానంగా ఈ వేదిక నిలిచింది. సమాచార సాంకేతిక వ్యవస్థలను ఆధునీకరించాం.

ఆధునిక అనలిటిక్స్, ఆరి్టఫీíÙయల్‌ ఇంటెలిజెన్స్‌ టూల్స్‌ను వినియోగిస్తున్నాం. ఆటోమేషన్‌ సాంకేతికలను అమలు చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి వద్ద ఉన్న తయారీ కేంద్రంలో స్థాపించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ డిజిటల్‌ ఫ్యాక్టరీ లైట్‌హౌస్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఉత్పాదకతను 20 శాతం పెంచాలని లక్ష్యంగా చేసుకుంది’ అని ఆయన వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్యకర వృద్ధిని ఆశిస్తున్నామని చెప్పారు. భారత్‌తోపాటు విదేశీ మార్కెట్ల కోసం 2023–24లో 65 లక్షలకు పైగా ద్విచక్ర వాహనాల ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. 2022–23లో కంపెనీ 53 లక్షల యూనిట్లను తయారు చేసింది. 54 లక్షల యూనిట్లను విక్రయించింది.  

ఈ ఏడాది దారి చూపుతాం..
భారత్‌లో మోటార్‌సైకిళ్లు, స్కూటర్ల డిమాండ్‌లో గ్రామీణ, ఉప నగర మార్కెట్లు సవాళ్లను ఎదుర్కొన్నాయని ముంజాల్‌ పేర్కొన్నారు. అయినప్పటికీ నిర్మాణాత్మక వృద్ధి అంశాలు చెక్కుచెదరకుండా కొనసాగుతున్నాయని తెలిపారు. ‘దేశంలోని యువ నైపుణ్యం కలిగిన జనాభా, గ్రామీణ, ఉప నగర ప్రాంతాల బలమైన ఆర్థిక వృద్ధి సామర్థ్యం, వినియోగదారులకు రుణాలు సులభంగా అందుబాటులో ఉండడం, లాస్ట్‌ మైల్‌ కనెక్టివిటీకి పెరుగుతున్న డిమాండ్‌ దృష్ట్యా విజయవంతమైన 2023–24 సంవత్సరానికి హీరో మోటోకార్ప్‌ దారి చూపుతుందని విశ్వసిస్తున్నాం. అంతర్జాతీయ మార్కెట్‌ పరిస్థితులు సవాల్‌ విసురుతున్నప్పటికీ బ్రాండ్‌ నిర్మాణం, కొత్త ఉత్పత్తుల విడుదల, నెట్‌వర్క్‌ పరిధిని విస్తరించడంలో పెట్టుబడులను కొనసాగించాం. ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారుగా కొత్త మార్కెట్లలో మా ఉనికిని నెలకొల్పడానికి, ఇప్పటికే ఉన్న వాటిలో వాటాను పెంచుకోవడానికి, మార్కెట్‌ అభివృద్ధి ప్రయత్నాలకు కట్టుబడి ఉండటానికి దీర్ఘకాలిక ప్రణాళికలను రచించాం. ఇంటర్నల్‌ కంబషన్‌ ఇంజన్, ఎలక్ట్రిక్‌ మోడళ్లకు మరింత విలువ కేంద్రీకృతంగా ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నాం’ అని ముంజాల్‌ పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు