హీరో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. ఫస్ట్‌ లుక్‌ !

10 Aug, 2021 11:59 IST|Sakshi

ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ మార్కెట్‌లో జోరు తగ్గడం లేదు. వరుసగా ఒక్కొ కంపెనీ తమ మోడళ్లకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తున్నాయి. ప్రపంచంలోనే అతి పెద్ద మోటార్‌ సైకిళ్ల తయారీ సంస్థ హీరో సైతం తన ఈవీ మోడల్‌కి సంబంధించిన వివరాలను చూచాయగా వెల్లడించింది. 

హోరీ మోటార్‌ కార్పో పదో వార్షికోత్సం సందర్భంగా ఆ సంస్థ అధినేత పవన్‌ ముంజాల్‌ హీరో అభిమానులకు స్వీట్‌ షాక్‌ ఇచ్చారు తమ సంస్థ నుంచి రాబోతున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ని అభిమానులకు చూపించారు. పదో వార్షికోత్సం సందర్భంగా ఏర్పాటు చేసిన లైవ్‌ స్ట్రీమ్‌లో సప్రైజింగ్‌ ఎలిమెంట్‌గా ఈవీ స్కూటర్‌ని పరిచయం చేశారు. రాబోయే రోజుల్లో  మరిన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు పవన్‌ ముంజాల్‌.  

స్థబ్ధుగా ఉన్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ మార్కెట్‌లో  ఓలా రాకతో అలజడి మొదలైంది. ప్రీ బుకింగ్‌లోనే లక్షకు పైగా ఆర్డర్లు సాధించి రికార్డు సృష్టించింది. పైగా ఓలా సీఈఓ భవీశ్‌ అగర్వాల్‌ ఓలా స్కూటర్‌కి సంబంధించి ఒక్కో ఫీచర్‌ని సోషల్‌ మీడియాలో వెల్లడిస్తూ మార్కెట్‌లో ఆసక్తి పెంచారు. దీంతో మిగిలిన కంపెనీలపైనా ఒత్తిడి పెరిగింది. తమ సంస్థ నుంచి రాబోతున్న వాహనాలకు సంబంధించిన వివరాలు వెల్లడించక తప్పని పరిస్థితి ఎదురైంది. దీంతో భవీష్‌ మార్కెటింగ్‌ టెక్నిక్‌నే ఫాలో అయారు. పవన్‌ ముంజాల్‌. హీరో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌కి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించకుండా కేవలం స్కూటర్‌ కనిపించేలా వీడియోను బయటకు వదిలారు. 

హీరో పదో వార్షికోత్సం ఈవెంట్‌లో లభించిన ఫోటో వివరాల ప్రకారం హీరో స్కూటర్‌లో ముందు వైపు టెలిస్కోపిక్‌ సస్పెన్షన్‌, వెనుక వైపు మోనో సస్పె‍న్షన్లు ఉపయోగించారు. ఫ్రంట్‌వీల్‌ డయా 12 ఇంచులు ఉండగా రియర్‌ వీల్‌ డయా 10 ఇంచులుగా ఉంది. మిగిలిన ఎలక్ట్రిక్‌ స్కూటర్లతో పోల్చితే హీరో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ సైజ్‌లో పెద్దదిగా ఉంది.

ఎలక్ట్రిక్‌ స్కూటర్లకు సంబంధించి బ్యాటరీ ఛార్జింగ్‌, బ్యాకప్‌ అనేది ప్రధాన సమస్యగా ఉంది. ఈ రెండు సమస్యలపై ఫోకస్‌ చేస్తూ.. తమ స్కూటర్‌ను మార్కెట్‌లోకి తెస్తామంటూ హీరో గతంలో ప్రకటించింది. ఈ మేరకు బ్యాటరీ స్వాపింగ్‌ టెక్నాలజీకి సంబంధించి తైవాన్‌కు చెందిన గొగోరో కంపెనీతో ఒప్పందం కూడా చేసుకుంది. ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో హీరో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ మార్కెట్‌లో రిలీజ్‌ అయ్యే అవకాశం ఉంది.
 

మరిన్ని వార్తలు