తడబాటు తప్పదేమో..!

24 Jan, 2022 04:26 IST|Sakshi

రేపటి ఫెడ్‌ రిజర్వ్‌ మీటింగ్‌పై ఫోకస్‌

రిపబ్లిక్‌ డే సందర్భంగా బుధవారం మార్కెట్‌కు సెలవు

గురువారం జనవరి ఎఫ్‌అండ్‌వో ముగింపు

బడ్జెట్‌పై అంచనాలు, క్యూ3 కంపెనీల ఫలితాలే కీలకం

ప్రపంచ పరిణామాలు, ఎఫ్‌ఐఐల తీరుతెన్నులపై దృష్టి

ఈ వారం మార్కెట్‌పై స్టాక్‌ నిపుణుల అభిప్రాయం

ముంబై: ఈ వారంలోనూ స్టాక్‌ మార్కెట్‌కు తడబాటు తప్పకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. కార్పోరేట్‌ కంపెనీల తాజా త్రైమాసిక ఫలితాలు, ఫెడ్‌ రిజర్వ్‌ నిర్ణయాలు మార్కెట్‌ తీరును ప్రభావితం చేసే అంశాలుగా ఉన్నాయని వారంటున్నారు. అలాగే వచ్చే బడ్జెట్‌లో ప్రయోజనాలపై అంచనాలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయవచ్చంటున్నారు. రిపబ్లిక్‌ డే సందర్భంగా బుధవారం (26న) మార్కెట్‌కు సెలవు దినం కావడంతో ట్రేడింగ్‌ నాలుగు రోజులకే పరిమితం కానుంది. జనవరి ఎఫ్‌అండ్‌ఓ డెరివేటివ్స్‌ గడువు గురువారం ముగియనుంది. ఈ పరిణామాల దృష్ట్యా మార్కెట్లో ఒడిదుడుకుల ట్రేడింగ్‌ తప్పకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

వీటితో పాటు ప్రపంచ పరిణామాలు, దేశీయ ఈక్విటీల్లోకి ఎఫ్‌ఐఐల పెట్టుబడుల తీరుతెన్నులను ఇన్వెస్టర్లు నిశితంగా పరిశీలించే అవకాశం ఉంది. అలాగే రూపాయి కదలిక, క్రూడాయిల్‌ ట్రేడింగ్, కరోనా కేసుల నమోదు తదితర అంశాలు మార్కెట్‌ గమనాన్ని నిర్ధేశించే అంశాలుగా ఉన్నాయి. భౌగోళిక ఉద్రిక్తతలతో పాటు విదేశీ ఇన్వెస్టర్లు మిడ్‌క్యాప్, లార్జ్‌క్యాప్‌ షేర్లలో లాభాల స్వీకరణకు పాల్పడటంతో గతవారంలో సూచీలు మూడున్నర శాతం నష్టపోయిన సంగతి తెలిసిందే. వారం మొత్తంగా సెన్సెక్స్‌ 2,186 పాయింట్లు, నిఫ్టీ 639 పాయింట్లు చొప్పున నష్టపోయాయి.

అగ్రరాజ్యం అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడ్‌ రిజర్వ్‌ పాలసీ సమావేశాలు మంగవారం(జనవరి 25న) మొదలై.., 26వ తేదిన(బుధవారం)ముగియనున్నాయి. ద్రవ్యోల్బణ కట్టడికి కీలక వడ్డీరేట్లను పెంచేందుకు సిద్ధమైన వేళ యూఎస్‌ ట్రెజరీ ఈల్డ్స్‌ రెండేళ్ల గరిష్టానికి, క్రూడాయిల్‌ ధరలు ఏడేళ్ల గరిష్టానికి చేరడంతో ఫెడ్‌ తీసుకొనే నిర్ణయాలు భారత్‌తో సహా ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల గమనానికి అత్యంత కీలకం కానున్నాయి. ఇక ఈ వారంలో సుమారు 360 కంపెనీలు త్రైమాసిక ఫలితాలను విడుదల చేయనున్నాయి. ఇందులో అధిక భాగం బ్యాంకింగ్‌ రంగానికి చెందిన కంపెనీలు.

మరిన్ని వార్తలు