విద్యా రుణాల్లోనూ ఎన్‌పీఏల వాత

26 Sep, 2022 06:27 IST|Sakshi

బ్యాంకుల్లో అప్రమత్త ధోరణి

8 శాతానికి చేరిన ఎగవేతలు

న్యూఢిల్లీ: ఉన్నత విద్య కల సాకారానికి సాయపడే విద్యా రుణాలకు సంబంధించి బ్యాంకుల్లో అప్రమత్త ధోరణి పెరుగుతోంది. ఎందుకంటే విద్యా రుణాల్లో ఎగవేతలు 8 శాతానికి చేరాయి. దీంతో తాజా విద్యా రుణాల మంజూరులో ఆచితూచి అడుగులు వేసేలా బ్యాంకుల ధోరణిలో మార్పు కనిపిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు ఇచ్చిన మొత్తం విద్యా రుణాల్లో ఎగవేతలు (మొండి బకాయిలు/ ఎన్‌పీఏలు) ఈ ఏడాది జూన్‌ చివరికి 7.82 శాతానికి పెరిగిపోయాయి.

వసూలు కావాల్సిన విద్యా రుణాల మొత్తం రూ.80వేల కోట్లుగా ఉంది. ఎన్‌పీఏలు పెరిగిపోయినందున బ్యాంకు శాఖల వారీగా అప్రమత్త విధానాన్ని అనుసరిస్తున్నట్టు ఓ ప్రభుత్వరంగ బ్యాంకు సీనియర్‌ అధికారి వెల్లడించారు. దీనివల్ల నిజాయితీ రుణ కేసుల్లోనూ మరింత పరిశీలన అవసరపడుతుందని, ఇది జాప్యానికి దారితీయవచ్చన్నారు. విద్యా రుణాల్లో జాప్యాన్ని నివారించడానికి, విద్యా రుణాల పోర్ట్‌ఫోలియో సమీక్షపై ఇటీవలే ప్రభుత్వరంగ బ్యాంకులతో కేంద్ర ఆర్థిక శాఖ సమావేశాన్ని నిర్వహించడం గమనార్హం. విద్యా రుణాల్లో ఇటీవలి కాలంలో ఎన్‌పీఏలు గణనీయంగా పెరిగిపోవడం అన్నది ఆందోళనకర అంశమని, దేశంలో ఉన్నత విద్యకు మద్దతుగా బ్యాంకుల రుణ వితరణకు ఇది విఘాతమని ఆర్‌బీఐ ఇటీవలి బులెటిన్‌ సైతం పేర్కొంది.  

ఉపాధి అవకాశాల్లేమి వల్లే..   
మన దేశంలో 90 శాతం మేర విద్యా రుణాలను ప్రభుత్వరంగ బ్యాంకులే అందిస్తున్నాయి. ప్రైవేటు రంగ బ్యాంకులు కేవలం ఏడు శాతం, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు 3 శాతం చొప్పున వాటాను 2020 మార్చి నాటికి కలిగి ఉన్నాయి. ఉద్యోగ మార్కెట్లోకి వస్తున్న పట్టభద్రుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధి అవకాశాల కల్పన లేదని రీసర్జంట్‌ ఇండియా ఎండీ జ్యోతి ప్రకాష్‌ పేర్కొన్నారు. ఇది విద్యా రుణ ఎగవేతలు పెరిగేందుకు కారణంగా అభిప్రాయపడ్డారు. దీంతో బ్యాంకులు విద్యా రుణాల విషయంలో అప్రమ్తతంగా వ్యవహరిస్తున్నట్టు చెప్పారు. ముఖ్యంగా రూ.7.5 లక్షల వరకు రుణాలను (హామీ/తాకట్టు ఉన్నవి, లేనివి) ఇవ్వడానికి వెనుకాడున్నట్టు పేర్కొన్నారు. నూతన విద్యా పాలసీని సమర్థంగా అమలు చేయడం, కనీస నైపుణ్యాలు, ఉపాధి కల్పన చర్యలు భాగస్వాములు అందరికీ మేలు చేస్తాయన్నారు. విద్యా రుణాలకు ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ రూపొందించిన నమూనాను బ్యాంకులు అనుసరిస్తున్నాయి. దీని కింద రూ.4 లక్షల వరకు విద్యా రుణాలకు ఎటువంటి తాకట్టు అవసరం లేదు. రూ.7.5 లక్షల వరకు రుణాలకు మూడో పార్టీ నుంచి గ్యారంటీ ఇవ్వాల్సి ఉంటుంది.  

మరిన్ని వార్తలు