అధిక పెట్రో ధరలు భారమే

6 Mar, 2021 03:52 IST|Sakshi

పన్నులు తగ్గించాలంటే ఏకాభిప్రాయానికి రావాలి

కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్‌

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్‌ ధరలను తగ్గించాలన్న ప్రజా డిమాండ్‌పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పందించారు. వీటి ధరలను తగ్గించాల్సిన అవసరాన్ని ఆమె అంగీకరిస్తూనే.. పన్నుల తగ్గింపు అన్నది కేంద్రం, రాష్ట్రాలు కలసి నిర్ణయం తీసుకుంటేనే సాధ్యపడుతుందన్నారు. దేశంలో రాజస్తాన్‌తోపాటు కొన్ని ప్రాంతాల్లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.100కు చేరుకోగా.. రిటైల్‌ ధరలో 60 శాతం కేంద్రం, రాష్ట్రాలకు పన్నుల రూపంలో వెళుతుండడం గమనార్హం. డీజిల్‌ రిటైల్‌ ధరలో 56 శాతం పన్నుల రూపంలోనే ఉంటోంది. కరోనా కారణంగా గతేడాది అంతర్జాతీయంగా చమురు ధరలు అత్యంత కనిష్టాలకు పడిపోయిన సమయంలో మంత్రి సీతారామన్‌ ఎక్సైజ్‌ సుంకాలను పెంచడం ద్వారా ఆదాయ లోటు లేకుండా జాగ్రత్తపడ్డారు. పెట్రోల్‌పై రూ.13, డీజిల్‌పై రూ.16 వరకు ఆమె ఎక్సైజ్‌ సుంకాన్ని పెంచారు.

ఈ విషయమై ఆర్థిక మంత్రి శుక్రవారం మీడియా ముఖంగా స్పందించారు. తగ్గించాల్సిన అవసరం ఉందంటూనే.. అందుకే తాను ధర్మసంకటం పదాన్ని ప్రయోగించినట్టు చెప్పారు. ‘‘ఈ విషయమై కేంద్రం, రాష్ట్రాలు చర్చించుకోవాల్సి ఉంది. ఎందుకంటే పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్రం ఒక్కటే పన్నులు విధించడం లేదు. రాష్ట్రాలు కూడా పన్నులు వసూలు చేసుకుంటున్నాయి’’ అని పరిస్థితిని ఆమె వివరించారు. కేంద్రం వసూలు చేస్తున్న పన్నుల్లో 41 శాతం రాష్ట్రాలకే వెళుతున్నట్టు చెప్పారు. జీఎస్‌టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్‌ను తీసుకువస్తే పన్నుల భారం తగ్గుతుందన్న డిమాండ్‌పై స్పందిస్తూ.. దీనిపై నిర్ణయం తీసు కోవాల్సింది జీఎస్‌టీ కౌన్సిల్‌ అని పేర్కొన్నారు. ఈ నెలలో జరిగే జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశం ముందుకు ఈ ప్రతిపాదన తీసుకువెళతారా? అన్న మీడియా ప్రశ్నకు.. సమావేశానికి ముందు దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.  

కెయిర్న్‌ ఆర్బిట్రేషన్‌పై అప్పీల్‌
కెయిర్న్‌ ఎనర్జీకి భారత్‌ 1.4 బిలియన్‌ డాలర్లు చెల్లించాలంటూ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ ట్రిబ్యునల్‌ ఇచ్చిన అవార్డుపై అప్పీల్‌ చేయడం తన విధిగా మంత్రి సీతారామన్‌ పేర్కొన్నారు. దేశ సార్వభౌమ యంత్రాంగానికి ఉన్న పన్ను విధింపు హక్కును ప్రశ్నించినప్పుడు అప్పీల్‌ చేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. ‘‘రెట్రోస్పెక్టివ్‌ పన్ను అంశంలో మా విధానాన్ని స్పష్టంగా వెల్లడించాము. 2014 నుంచి 2020 వరకు ఏటా దీన్నే పునరావృతం చేశాం. ఇందులో స్పష్టత లేకపోవడమేమీ  కనిపించలేదు’’ అని మంత్రి చెప్పారు.

ఆర్థిక ఉద్దీపనల భారాన్ని ప్రజలపై వేయం...
ప్రభుత్వం ప్రకటించిన అన్ని ఆర్థిక ఉద్దీపనలకు కావాల్సిన నిధులను రుణాలు, ఆదాయాల రూపంలో సమకూర్చుకుంటామే కానీ, ప్రజలపై భారం వేయబోమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. పన్ను చెల్లింపుదారులపై ఇందుకు సంబంధించి ఒక్క రూపాయి కూడా చార్జీ ఉండదన్నారు. ఖర్చు చేసేందుకు ప్రభుత్వం రుణాలు తీసుకుంటుందే కానీ, ప్రజల నుంచి కాదని చెప్పారు.  క్రిప్టో కరెన్సీల నియంత్రణపై ఆర్‌బీఐతో సంప్రదింపులు చేస్తున్నామని వెల్లడించారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు