మళ్లీ కట్టెల పొయ్యి దగ్గరికి.. 

12 Jul, 2021 00:59 IST|Sakshi

గ్యాస్‌ ధరలు పెరగడంతో పాత పద్దతిలోకి మహిళలు

మట్టి పొయ్యిలపైనే వంటలు చేస్తున్న వైనం

నిత్యావసరాల ధరలు అమాంతం పెరగడంతో మారుతున్న జీవితాలు

ముంబై సెంట్రల్‌: కరోనా ప్రజల ఆర్థిక పరిస్థితిని దెబ్బతీయగా మరోవైపు పెరుగుతున్న ధరలు సామాన్య ప్రజల నడ్డివిరుస్తున్నాయి. దీంతో అనేక కుటుంబాల ఆర్థిక స్థితి దయనీయంగా మారుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో గ్యాస్‌ సిలిండర్‌ ధరలు పెరగడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. గత ఏడాది రూ.640గా ఉన్న 14.2 కేజీల గ్యాస్‌ సిలిండర్‌ ధర ఈ ఏడాది జూలైలో రూ. 886.50గా ఉంది. 2014లో సిలిండర్‌ ధర రూ.410 ఉండగా ఏడేళ్లలో అదే సిలిండర్‌ ధర రెట్టింపవడం గమనార్హం. సిలిండర్‌ ధరల్ని భరించలేక రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మహిళలు తిరిగి కట్టెలు, బొగ్గులతో మండే పొయ్యిల వైపు మళ్లుతున్నారు. మహిళలు జీవితాంతం కట్టెల పొయ్యిలతో, పొగతో గడిపి, కొంత కాలం నుంచి గ్యాస్‌ సిలిండర్‌లపై వంటలు చేస్తూ కాస్త ఉపశమనం లభిస్తున్న నేపథ్యంలో సిలిండర్‌ ధరలు ఆకాశాన్ని అంటుకోవడంతో జీవితాలు తలకిందులయ్యాయి. కరోనా వల్ల ఉపాధి పోగొట్టుకోవడం వల్ల సిలిండర్‌లు వాడే స్థోమత లేకుండా పోయింది. అందుకే మళ్లీ మేం కట్టెలు, బొగ్గులతో వంటిల్లును నడిపిస్తున్నామని ఓ మహిళా సంఘం సభ్యురాలు రుక్మిణి నాగ్‌పురే వాపోయారు.

ఎట్లా బతికేది..?
కరోనా వల్ల మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి జీవితాలపై ప్రతికూల ప్రభావం పడింది. ఒకవైపు లాక్‌డౌన్‌ వల్ల ఆర్థిక ఆదాయం తగ్గడం, మరోవైపు ధరలు పెరగడం, అత్యవసరమైన గ్యాస్‌ ధరలు కూడా పెంచడం వల్ల పలు కుటుంబాలు తిరోగమ న బాట పట్టి మట్టి పొయ్యిలను ఆశ్రయిస్తున్నారు. నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయని ప్రభుత్వం కనీసం గ్యాస్‌ సిలిండర్‌ ధరలపై కూడా దయ చూపకపోవడం వల్ల జీవితాలు నిత్యం కాలుతున్న కుంపటిలా తయారయ్యాయని హాత్‌కణంగ్లే తాలూకా హెర్లే గ్రామానికి చెందిన ఊర్మిళా కుర్ణే ఆవేదన వ్యక్తంచేశారు.

ఏడాదిన్నర నుంచి కుటుంబ పరిస్థితులు పూర్తిగా దిగజారిపోయాయని చేసేందుకు పనే లేకుంటే డబ్బులు ఎక్కడ్నుంచి వస్తాయని కరాడ్‌కు చెందిన ప్రతిజ్ఞా పవార్‌ అన్నారు. కరోనా వల్ల ఉన్న ఉద్యోగాలు పోయాయ ని ఆవేదన వ్యక్తంచేశారు. చిన్నచిన్న పనులు చేసుకొని బతుకుదామంటే వంట నూనె, పప్పులు, గ్యాస్‌ ధరలన్నీ బాగా పెరిగిపోవడంతో జీవితాలు ఘోరంగా తయారయ్యాయని, ఎట్లా బతికేదని బోరుమన్నారు. ఇంత కాలం గ్యాస్‌పై వండుకున్నామని, ఇప్పుడు మళ్లీ కట్టెల పొయ్యే శరణ్యమైందని ప్రతిజ్ఞా పవార్‌ కన్నీళ్లు పెట్టుకున్నారు.

బుల్డాణాకు చెందిన మహిళా మండలి ప్రతినిధి ఉషా నర్వాడే మాట్లాడుతూ.. ‘‘ఇంతకాలం మహిళల ఆరోగ్యం బాగుండాలని గ్యాస్‌ సిలిండర్‌లు వాడాలని మేం చెబుతూ వచ్చాం. కానీ, ఇప్పుడు చేసేందుకు పను లు లేవు. ఇంటికి చిల్లిగవ్వ రావడం లేదు. గ్యాస్‌ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. పరిస్థితులు తారుమారయ్యాయి. ఆర్థికంగా చితికిపోవడం వల్ల కట్టెల పొయ్యిలే ఇప్పుడు దిక్కయ్యాయి. మళ్లీ కష్టాల రోజులు వచ్చాయి’’ అంటూ బాధపడ్డారు.   

మరిన్ని వార్తలు