హైక్ మెసెంజర్ సేవలు నిలిపివేత

18 Jan, 2021 12:08 IST|Sakshi

ప్రస్తుత ఇంటర్నెట్ ప్రపంచంలో ప్రతి ఒక్కరి మొబైల్ ఫోన్లలో మెసేజింగ్ యాప్స్ తప్పనిసరి అయ్యాయి. మొబైల్ యూజర్లు వారి కుటుంబ, స్నేహితులతో కనెక్ట్ అవ్వడానికి బోలెడు యాప్ లు మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. మనదేశంలో బాగా ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్స్ లో "హైక్ మెసెంజర్" ఒకటి. 2012 సంవత్సరంలో హైక్ ప్రారంభించారు. అతి కొద్దీ కాలంలోనే హైక్ మెసెంజర్ ప్రజాదరణ పొందింది. కొంతకాలం తర్వాత వాట్సాప్ ప్రపంచవ్యాప్తంగా ప్రజలను చేరుకోవడంతో దీని ఆదరణ క్రమంగా తగ్గింది. హైక్ స్టిక్కర్ చాట్స్ ని అతిపెద్ద ఇండియన్ ఫ్రీవేర్, క్రాస్-ప్లాట్‌ఫాం ఇన్‌స్టంట్ మెసేజింగ్ అప్లికేషన్ అని కూడా పిలిచేవారు. (చదవండి: ఒప్పో రెనో 5ప్రో విడుదల నేడే)

2016 ఆగష్టు నాటికి హైక్ 100 మిలియన్ల రీజిస్టర్డ్ వినియోగదారులను కలిగి ఉంది. ఇది 10 ప్రాంతీయ భారతీయ భాషలకు కూడా సపోర్ట్ లభించేది. ఒక కోటి యూజర్లను కలిగిఉన్న హైక్ సేవలను నిలిపి వేస్తున్నట్లు హైక్ మెసెంజర్ యాప్ సీఈఓ కెవిన్ భారతి మిట్టల్ ట్విట్టర్‌ వేదికగా జనవరి 6న ప్రకటించారు ‘స్టిక్కర్ చాట్ యాప్ జనవరి 21తో అస్తమించనుంది. మాపై నమ్మకముంచినందుకు ధన్యవాదములు. మీరంతా లేకపోతే మేమిక్కడ ఉండేవాళ్లం కాదు’ అని ట్విటర్ లో పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్తగా ప్రైవసీ పాలసీ నిబంధనలు తేవడంతో ప్రస్తుతం అది చిక్కుల్లో పడింది.(చదవండి: ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్‌ డేస్‌.. ఆఫర్లే ఆఫర్లు)

ప్రస్తుతం వాట్సాప్‌కు ప్రత్యామ్నాయాల కోసం వెతుకుతున్నప్పుడు హైక్ సంస్థ తన సేవలను ఎందుకు నిలిపివేస్తుందనే దానిపై స్పష్టత లేదు. హైక్ మెసెంజర్ యూజర్లు వారి సంభాషణలు, డేటాను యాప్ లోనే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అని సంస్థ పేర్కొంది. అయితే, తక్షణమే ఎందుకు నిలిపివేస్తున్నారో కారణాన్ని ఇండియన్ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ హైక్ వెల్లడించలేదు. హైక్ మెసేంజర్ లాంటి యాప్ లను కోరుకునే వారి కోసం వైబ్, రష్ యాప్ లు ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్ ఫాంలలోనూ అందుబాటులో ఉన్నాయి. అలాగే హైక్ స్టిక్కర్లు, మోజీలు మొత్తం వైబ్, రష్ యాప్ లలో దొరుకుతున్నాయి. 


 

మరిన్ని వార్తలు