ఇండస్‌ఇండ్‌కు తాజా పెట్టుబడులు

19 Feb, 2021 05:38 IST|Sakshi

ప్రమోటర్ల నుంచి రూ. 2,021 కోట్ల సమీకరణ

రూ. 1,709 ధరలో ఈక్విటీగా వారంట్లు మార్పిడి

న్యూఢిల్లీ: ప్రయివేట్‌ రంగ సంస్థ ఇండస్‌ఇండ్‌ బ్యాంకుకు తాజాగా రూ. 2,201 కోట్ల పెట్టుబడులు లభించాయి. హిందుజా గ్రూప్‌నకు చెందిన బ్యాంక్‌ ప్రమోటర్లు ప్రిఫరెన్షియల్‌ వారంట్లను ఈక్విటీగా మార్పిడి చేసుకోవడం ద్వారా ఈ నిధులను అందించారు. 2019 జూలైలో భారత్‌ ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్‌ను విలీనం చేసుకున్న నేపథ్యంలో ప్రమోటర్లకు బ్యాంకు వారంట్లను జారీ చేసింది. విలీన సమయంలో ప్రమోటర్లు వారంట్లపై తొలిదశలో రూ. 673 కోట్లు చెల్లించారు. మిగిలిన రూ. 2021 కోట్లను తాజాగా విడుదల చేసినట్లు బ్యాంక్‌ పేర్కొంది. వారంట్లను షేరుకి రూ. 1,709 ధరలో ఈక్విటీగా మార్పిడి చేసుకున్నట్లు వెల్లడించింది. బుధవారం షేరు ముగింపు ధర రూ. 1033తో పోలిస్తే మార్పి డి ధర 65 శాతం ప్రీమియంకావడం గమనార్హం!
 
2019లో..:
ప్రమోటర్‌ సంస్థలు ఇండస్‌ఇండ్‌ ఇంటర్నేషనల్‌ హోల్డింగ్స్, ఇండస్‌ఇండ్‌ లిమిటెడ్‌కు దాదాపు 1.58 కోట్ల ఈక్విటీ షేర్లను కేటాయించేందుకు తాజాగా ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ ఫైనాన్స్‌ కమిటీ అనుమతించింది. 2019 జూలై 6న ప్రమోటర్‌ సంస్థలకు బ్యాంకు ఇదే స్థాయిలో వారంట్లను జారీ చేసింది. వీటి విలువ రూ. 2,695 కోట్లు. ఈ సమయంలో 25% సొమ్ము (రూ.674 కోట్లు)ను ప్రమోటర్లు చెల్లించారు. కాగా.. తాజా పెట్టుబడుల నేపథ్యంలో కనీస మూలధన నిష్పత్తి 17.68 శాతానికి బలపడినట్లు బ్యాంక్‌ తెలియజేసింది.
ఎన్‌ఎస్‌ఈలో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేరు 1 శాతం లాభంతో రూ. 1,043 వద్ద ముగిసింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు