Coca Cola: తెలంగాణకు మరో భారీ ప్రాజెక్టు.. రూ.1000 కోట్ల పెట్టుబడులు

7 Apr, 2022 11:46 IST|Sakshi

దేశీ దిగ్గజ కంపెనీ విప్రోతో పాటు మల్టీ నేషనల్‌ ఫార్మా సంస్థ జాంప్‌ల తర్వాత మరో భారీ ప్రాజెక్టు తెలంగాణకు వచ్చింది. హిందూస్థాన్‌ కోకకోలా బేవరేజేస్‌ సంస్థ రూ. 1000 కోట్ల పెట్టుబడి పెడుతోంది. ఈ విషయాన్ని గురువారం మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. సిద్ధిపేట సమీపంలో భారీ ప్లాంటు నిర్మాణం జరుపుకోబోతుంది.

తెలంగాణలో భారీ బేవరేజెస్‌ ప్లాంటు నిర్మించడంతో పాటు సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌, వేస్ట్‌ వాటర్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ స్కిలింగ్‌ విభాగంలో తెలంగాణ కలిసి పని చేసేందుకు ప్రభుత్వంతో హిందూస్థాన్‌ కోకకోల సంస్థ ఒప్పందం చేసుకుంది. ఈ సందర్భంగా తెలంగాణలో రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ కూడా పెట్టాలంటూ హిందూస్థాన్‌ బేవరేజెస్‌ని మంత్రి కేటీఆర్‌ కోరారు.

హిందూస్థాన్‌ కోకకోల బేవరేజేస్‌ కంపెనీతో ఎంవోయూ కుదరిన సందర్బంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ... సిద్ధిపేట సమీపంలోని బండ తిమ్మాపూర్‌ దగ్గరున్న ఫుడ్‌ పార్క్‌లో ఈ ప్లాంటు నిర్మాణం జరగబోతుందని తెలిపారు. మొదటి దశలో రూ. 600 కోట్లతో ప్లాంట్‌ నిర్మాణం చేపట్టి  రెండో దశలో రూ. 400 కోట్లతో ప్లాంట్‌ను విస్తరిస్తారని తెలిపారు. ఈ ప్లాంట్‌లో 50 శాతం ఉద్యోగాలు మహిళలకే కేటాయిస్తారని తెలిపారు. జగిత్యాలలో ఉన్న మామిడి పండ్లు, నల్గొండ దగ్గరున్న నిమ్మ ఉత్పత్తులు ఉపయోగించుకునేలా ప్రణాళిక రూపాందించుకోవాలంటూ హెచ్‌సీసీబీ ప్రతినిధులకు మంత్రి కేటీఆర్‌ సూచించారు.

ఇండియాలో ఉన్న ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ కంపెనీల్లో హిందూస్థాన్‌ బేవరేజ్‌ సంస్థ ఒకటి. మాన్యుఫ్యాక​‍్చరింగ్‌, ప్యాకేజింగ్‌, సెల్లింగ్‌, డిస్ట్రిబ్యూషన్‌ రంగాల్లో ఈ సంస్థ సేవలు అందిస్తోంది. మినిట్‌ మైడ్‌, స్ప్రైట్‌, మోన్‌స్టర్‌, థమ్సప్‌, లిమ్కా వంటి ప్రముఖ బ్రాండు ఈ సంస్థకు చెందినవిగా ఉన్నాయి.

చదవండి: Jamp Pharma: కెనడా వెలుపల తొలి ఎక్స్‌లెన్స్‌ సెంటర్‌ హైదరాబాద్‌లో..

మరిన్ని వార్తలు