హిందుస్తాన్‌ మోటర్స్‌.. ఎలక్ట్రిక్‌ టూవీలర్స్‌

4 Jul, 2022 04:26 IST|Sakshi

యూరప్‌ సంస్థతో జాయింట్‌ వెంచర్‌

వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఉత్పత్తి యోచన

కోల్‌కతా: ఒకప్పటి అంబాసిడర్‌ కార్ల తయారీ సంస్థ హిందుస్తాన్‌ మోటర్స్‌ (హెచ్‌ఎం) తాజాగా ఎలక్ట్రిక్‌ టూవీలర్ల ఉత్పత్తిపై దృష్టి పెడుతోంది. ఇందుకోసం యూరప్‌కి చెందిన సంస్థతో జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటు చేస్తోంది. వచ్చే ఏడాదిలో వాహనాల తయారీని ప్రారంభించే అవకాశం ఉందని సంస్థ డైరెక్టర్‌ ఉత్తమ్‌ బోస్‌ వెల్లడించారు. తర్వాత దశలో ఎలక్ట్రిక్‌ కార్ల తయారీపైనా దృష్టి పెట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. రెండు సంస్థలకు సంబంధించిన ఆర్థిక అంశాల మదింపు జూలైలోనే ప్రారంభం అవుతుందని, ఇందుకోసం రెండు నెలల సమయం పట్టొచ్చని బోస్‌ చెప్పారు.

అటు పైన జాయింట్‌ వెంచర్‌ సాంకేతిక అంశాల మదింపు ప్రారంభం అవుతుందని, దీనికి మరో నెల రోజులు పట్టొచ్చని పేర్కొన్నారు. ఆ తర్వాత పెట్టుబడుల స్వరూపం గురించి నిర్ణయం తీసుకోవడం, కొత్త సంస్థను ఏర్పాటు చేయడం మొదలైనవి ఉంటాయన్నారు. ఇదంతా ఫిబ్రవరి 15 నాటికి పూర్తయ్యే అవకాశం ఉందని బోస్‌ వివరించారు. ‘కొత్త సంస్థ ఏర్పాటు చేశాక, ప్రాజెక్టును పైలట్‌ ప్రాతిపదికన మొదలెట్టడానికి మరో రెండు క్వార్టర్లు పడుతుంది. మొత్తం మీద వచ్చే ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి తుది ఉత్పత్తిని ఆవిష్కరించవచ్చు‘ అని పేర్కొన్నారు. ద్విచక్ర వాహనాల ప్రాజెక్టు అమల్లోకి వచ్చిన రెండేళ్లకు కార్ల తయారీపై దృష్టి పెడతామని బోస్‌ చెప్పారు.
 

మరిన్ని వార్తలు