అవును నిజం.. త్వరలో ఎలక్ట్రిక్‌ ‘అంబాసిడర్‌’ కారు!

27 May, 2022 00:38 IST|Sakshi

ఎలక్ట్రిక్‌ వాహనాలతో మరో ఇన్నింగ్స్‌కు సన్నాహాలు

యూరోపియన్‌ వాహనాల కంపెనీతో చర్చలు

త్వరలో జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటు

న్యూఢిల్లీ: హిందుస్తాన్‌ మోటార్స్‌.. దేశీయంగా తొలి కార్ల తయారీ సంస్థ. హుందాతనం ఉట్టిపడే అంబాసిడర్‌ కార్ల తయారీతో ఓ వెలుగు వెలిగింది. అయితే, కాలక్రమంలో వచ్చిన కొత్త మార్పులు, కస్టమర్ల అభిరుచులను అందిపుచ్చుకోలేక రేసులో వెనుకబడిపోయింది. చివరికి కార్ల తయారీని పూర్తిగా నిలిపివేసింది. అయితే, ఇప్పుడు మరోసారి ఎంట్రీకి సిద్ధమవుతోంది. ఈసారి సరికొత్తగా ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ)తో మార్కెట్లోకి అడుగుపెడుతోంది. ఇందుకోసం యూరోపియన్‌ ఆటోమొబైల్‌ కంపెనీతో జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటు చేయనుంది.

ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే అవగాహనా ఒప్పందం కుదుర్చుకోగా .. వచ్చే 2–3 నెలల్లో ఇవి ఒక కొలిక్కి రానున్నట్లు సంస్థ డైరెక్టర్‌ ఉత్తమ్‌ బోస్‌ వెల్లడించారు. ముందుగా ద్విచక్ర వాహనాలు, ఆ తర్వాత కార్లను ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు. జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటు పైనే చర్చలు జరుగుతున్నప్పటికీ హిందుస్తాన్‌ మోటార్స్‌లో సదరు యూరోపియన్‌ కంపెనీ వాటాలు కొనుగోలు చేసే అవకాశాలూ ఉండొచ్చని తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర్‌పారాలో .. 295 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్లాంటును జేవీ కోసం ఉపయోగించుకునే అవకాశం ఉంది.  

గతం ఘనం..: హిందుస్తాన్‌ మోటార్స్‌ను (హెచ్‌ఎం) 1942లో బీఎం బిర్లా ప్రారంభించారు. 1970ల నాటికి హెచ్‌ఎంకు దేశీయంగా 75 శాతం పైగా మార్కెట్‌ వాటా ఉండేది. అయితే, 1983లో మారుతీ సుజుకీ కొత్తగా మారుతీ 800 కార్లను ప్రవేశపెట్టిన తర్వాత నుంచి కంపెనీ ప్రాభవం తగ్గడం మొదలైంది. 1984–1991 మధ్య కాలంలో అంబాసిడర్‌ మార్కెట్‌ వాటా దాదాపు 20 శాతానికి పడిపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇక ఆ తర్వాత కాలంలో విదేశీ ఆటోమొబైల్‌ కంపెనీలు కూడా భారత్‌లో భారీగా విస్తరించడం మొదలుపెట్టడంతో కంపెనీ పతనం మరింత వేగవంతమయ్యింది.

హెచ్‌ఎంకు ఉత్తర్‌పారాలో దాదాపు 700 ఎకరాల స్థలం ఉండేది. కార్యకలాపాలు కుదేలు కావడంతో 2007లో 314 ఎకరాల మిగులు స్థలాన్ని శ్రీరామ్‌ ప్రాపర్టీస్‌కు విక్రయించేందుకు డీల్‌ కుదుర్చుకుంది. గతేడాది లాజిస్టిక్స్, హైపర్‌స్కేల్‌ డేటా సెంటర్‌ పార్క్‌ ఏర్పాటు కోసం మరో 100 ఎకరాలను కొనుగోలు చేసేందుకు హెచ్‌ఎంతో హీరానందానీ గ్రూప్‌ ఒప్పందం కుదుర్చుకుంది.  2014 మేలో నిధుల కొరత, ఉత్పత్తులకు డిమాండ్‌ పడిపోవడం, ఉత్పాదకత పడిపోవడంతో ఉత్తర్‌పారా ప్లాంటులో ఉత్పత్తిని హెచ్‌ఎం నిలిపివేసింది.

అదే ఏడాది డిసెంబర్‌లో పిఠమ్‌పూర్‌ ప్లాంటులో లేఆఫ్‌ ప్రకటించింది. ఆ తర్వాత 2017లో తమకు ఎంతో పేరు తెచ్చిపెట్టిన అంబాసిడర్‌ బ్రాండును కూడా రూ. 80 కోట్లకు ప్యూజో ఎస్‌ఏకి అమ్మేసింది. ఇటీవలి హెచ్‌ఎం ఆర్థిక ఫలితాల ప్రకారం మార్చి 2022 ఆఖరు నాటికి కంపెనీకి రూ. 149 కోట్ల మేర రుణభారం పేరుకుపోయింది. ప్రస్తుతం సుమారు 300 మంది వరకూ సిబ్బంది ఉన్నారు. తాజాగా హీరానందానీతో డీల్‌ ద్వారా వచ్చే నిధులు.. రుణభారాన్ని తీర్చేసేందుకు ఉపయోగపడతాయని బోస్‌ పేర్కొన్నారు. మిగులు నిధులను కొత్తగా చేపడుతున్న ఎలక్ట్రిక్‌ వాహనాలు, విడిభాగాల ప్రాజెక్టుపై వెచ్చించనున్నట్లు వివరించారు.

చదవండి:  భవీష్‌ అగర్వాల్‌.. మా ప్రాణాల్ని కాపాడండి!

మరిన్ని వార్తలు