హిందుస్తాన్‌ జింక్‌ లాభం అప్‌

22 Oct, 2022 00:54 IST|Sakshi

క్యూ2లో రూ. 2,680 కోట్లు

న్యూఢిల్లీ: వేదాంతా గ్రూప్‌ మెటల్‌ దిగ్గజం హిందుస్తాన్‌ జింక్‌ ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలతాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్‌(క్యూ2)లో నికర లాభం 33 శాతం ఎగసి రూ. 2,680 కోట్లను తాకింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో కేవలం రూ. 2,017 కోట్లు ఆర్జించింది. అధిక అమ్మకాల పరిమాణం, ధరలు ఇందుకు దోహదపడినట్లు కంపెనీ పేర్కొంది.

కమోడిటీ ధరలు బలపడటంతో ముడివ్యయాలు పెరిగినప్పటికీ వ్యూహాత్మక హెడ్జింగ్, విదేశీ మారక లాభాలు ఆదుకున్నట్లు తెలియజేసింది. కాగా.. క్యూ2లో మొత్తం ఆదాయం రూ. 5,958 కోట్ల నుంచి రూ. 8,127 కోట్లకు జంప్‌చేసింది. ఈ కాలంలో మైన్‌డ్‌ మెటల్‌ ఉత్పత్తి దాదాపు 3 శాతం వృద్ధితో 2,55,000 టన్నులను తాకింది. దీంతో సమీకృత మెటల్‌ ఉత్పత్తి మరింత అధికంగా 17.5 శాతం మెరుగుపడి 2,460,000 టన్నులకు చేరింది. కంపెనీ దేశంలోనే జింక్, లెడ్, సిల్వర్‌ను ఉత్పత్తి చేస్తున్న ఏకైక సంస్థగా నిలుస్తున్న విషయం విదితమే.

ఫలితాల నేపథ్యంలో హిందుస్తాన్‌ జింక్‌ షేరు  0.7% లాభపడి రూ. 280 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు