ఆ రంగంలో బలంగా నియామకాలు

21 Dec, 2022 15:36 IST|Sakshi

ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం (2023 జనవరి–మార్చి)లో సేవల రంగంలో నియామకాలు బలంగా ఉంటాయని టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌ ‘ఎంప్లాయర్స్‌ అవుట్‌లుక్‌ నివేదిక’ తెలియజేసింది. ఈ సంస్థ నిర్వహించిన సర్వేలో 77 శాతం కంపెనీల ప్రతినిధులు క్యూ4లో నియామకాలు చేపట్టనున్నట్టు తెలిపారు. అక్టోబర్‌–డిసెంబర్‌ (క్యూ3) త్రైమాసికంలో ఇలా చెప్పిన సంస్థలు 73 శాతంతో పోలిస్తే నియామకాల సెంటిమెంట్‌ మెరుగుపడినట్టు తెలుస్తోంది.

గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం అంచనాలతో పోలిస్తే 27 శాతం అధికమని టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌ నివేదిక తెలిపింది. ఫ్రెషర్లకు (గ్రాడ్యుయేట్లు) ఎక్కువ అవకాశాలు ఇస్తామని 79 శాతం కంపెనీలు చెప్పాయి. ఈ కామర్స్‌ విభాగంలో 98 శాతం, టెలికమ్యూనికేషన్స్‌లో 94 శాతం, విద్యా సంబంధిత సేవల్లో 93 శాతం, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌లో 88 శాతం, రిటైల్‌లో 85 శాతం, లాజిస్టిక్స్‌లో 81 శాతం కంపెనీలు నియామకాలు చేపట్టనున్నాయి. ‘‘అంతర్జాతీయ ఆర్థిక మాంద్యంతో ఉద్యోగాల తొలగింపులు, నియామకాల నిలిపివేతల ప్రభావం సేవల రంగంపై ఉంది. కానీ, భారత్‌లో ఈ సెంటిమెంట్‌ ఎగువ దిశగా బలంగా ఉంది. 77 శాతం మంది నియామకాలు చేపట్టే ధోరణితో ఉన్నారు’’అని టీమ్‌ లీజ్‌ సర్వీసెస్‌ చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ మయూర్‌ తెలిపారు.

చదవండి: ఆరేళ్లలో బ్యాంకింగ్‌ రుణ మాఫీ ఎన్ని లక్షల కోట్లు తెలుసా?

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు