హోం లోన్‌ తీసుకున్నవారికి మరో భారీ షాక్‌ తప్పదా? ఏం చేయాలి?

3 Aug, 2022 13:53 IST|Sakshi

ఈఎంఐ, కాల వ్యవధి ఏది పెంచుకుంటే బెటర్‌?

సాక్షి, ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  ద్రవ్య విధాన కమిటీ సమావేశం (ఎంపీసీ)  ఆగస్టు 3 బుధవారం ప్రారంభం కానుంది. అయితే రెపో రేటు బాదుడు తప్పదనే అంచనాల మధ్య హోం లోన్ రేట్లు ఎంత పెరుగుతాయోననే ఆందోళన వినియోగదారుల కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ద్రవ్యోల్బణానికి చెక్‌ చెప్పేలా ఆర్బీఐ వరుసగా మూడోసారి రెపో రేటును పెంచే అవకాశం ఉందని మార్కెట్‌వర్గాలు, ఇటు నిపుణులు భావిస్తున్నారు.   (నిర్మలా సీతారామన్‌పై బీజేపీ సీనియర్‌ సెటైర్లు: తీవ్ర చర్చ)

ఆర్బీఐ ద్రవ్య విధాన కమిటీ తాజా రివ్యూలో రెపో రేట్లను పెంచే అవకాశాలపైనే ఎక్కువ అంచనాలు కనిపిస్తున్నాయి.  అధిక ద్రవ్యోల్బణం కారణంగా వడ్డీ రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని, దాదాపు 35-50 బేసిస్ పాయింట్లకు చేరుకోవచ్చని నిపుణులు ఊహిస్తున్నారు. అంచనాలకనుగుణంగా రెపో రేటు పెరిగితే,  అనివ్యారంగా బ్యాంకులు కూడా మొత్తం రేటు పెంపును కస్టమర్‌లకు బదిలీ చేస్తాయి. రెపో రేటు పెరిగితే ఆర్బీఐకి బ్యాంకులు ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఆ భారాన్ని బ్యాంకులు కస్టమర్ల మీదే వేస్తాయి. ఈ నేపథ్యంలో ఇంటిలోన్లపై భారం తప్పదు.

ఉదా: రూ. 50 లక్షల  రుణం, 7.65 శాతం వడ్డీతో 20 సంవత్సరాల కాలవ్యవధితో ఉన్న  లోన్‌పై  వడ్డీ రేటు 0.50 శాతం పెంచితే, వడ్డీ రేటు 8.15కి పెరుగుతుంది అనుకుంటే, రుణ వ్యవధిని రెండేళ్లు పొడిగింపు ఆప్షన్‌ ఎంచుకోవచ్చు. అయితే లోన్‌ కాలం రెండేళ్లు పొడిగించడంతో ఖచ్చితంగా రూ. 10.14 లక్షలు అదనపుభారం తప్పదు. ఒకవేళ చెల్లించాల్సిన కాలం కాకుండా, ఈఎంఐ భారాన్ని పెంచుకుంటే.. ఉదా: 20 సంవత్సరాల కాలవ్యవధిలో రూ. 50 లక్షల రుణంపై, వడ్డీ రేట్లు 50 బేసిస్ పాయింట్లు పెరుగుతాయని భావిస్తే.. మునుపటి ఈఎంఐ రూ. 40,739తో పోలిస్తే రూ. 42,289  చెల్లించాల్సి ఉంటుంది.

అయితే ఇక్కడ ఇంటి రుణం తీసుకున్న వారు ఏ సిస్టంలో ఉన్నారో చెక్ చేసుకోవాలి. దాని ప్రకారం ఈఎంఐ పెంచుకోవడమా, కాల వ్యవధిని పెంచుకోవడమా అనేది రుణగ్రహీత జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఇప్పటికే లోబడ్జెట్‌లో ఉండి ఉంటే పొదుపు, ఖర్చులపై దెబ్బపడకుండా లోన్ టెన్యూర్‌ను లేదా ఈఎంఐని పెంచుకోవడంమంచిది. అలాగే ఏ ఆప్షన్‌ ఎంచుకన్నా, దీర్ఘకాలిక రాబడి, భవిష్యత్తు అవసరాలకోసం ఎంతో  కొంత  పొదుపు చేసుకోవడం చాలా ముఖ్యం. (ఆనంద్‌ మహీంద్ర వీడియో: నెటిజనుల కౌంటర్స్‌ మామూలుగా లేవు!)

కాగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌ నేతృత్వంలోని పాలసీ కమిటీ మూడు రోజుల పాటు సమావేశం కానుంది. పాలసీ విధానాన్ని శుక్రవారం (ఆగస్టు 5న) ప్రకటించనుంది. అయితే ఈ సారి రివ్యూలో కూడా  రేటు పెంపు తప్పదని నిపుణులు సూచిస్తున్నారు. ఆర్బీఐ మే 4, 2022 నుండి రెపో రేటును 0.9 శాతం పెంచింది. ఫలితంగా 6.72 శాతం వద్ద గృహ రుణం తీసుకున్న వారు  ఇప్పుడు 7.62 శాతం చెల్లించాల్సి వస్తోంది. గత రెండు మానిటరీ పాలసీ సమావేశాల్లో 90 బేసిస్ పాయింట్లు పెంచిన సంగతి తెలిసిందే.  దీనికి తోడు ఇటీవల అమెరికా ఫెడ్‌ రికార్డు స్థాయిలో 75 బేసిస్‌ పాయింట్లు రేట్లు పెంచింది. అలాగే ఆ తరువాత కూడా పెంపు ఉంటుందనే సంకేతాలు అందించింది.

>
మరిన్ని వార్తలు