మీకు తెలుసా..కొత్త ఇంటి కొనుగోలుపై రూ. 5 లక్షలకు పైగా బెనిఫిట్స్‌..!

29 Jan, 2022 14:36 IST|Sakshi

సొంత ఇల్లు కొనుక్కోవడం అనేది ప్రతి ఒక్కరి కల. ప్రభుత్వాలు కూడా ఇళ్లపై పెట్టుబడులను ప్రోత్సహిస్తాయి. అందుకే సెక్షన్ 80C కింద గృహ రుణంపై పన్ను మినహాయింపు వర్తిస్తోంది. మీరు గృహ రుణంపై ఇంటిని కొనుగోలు చేసినప్పుడు పన్ను భారం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ప్రభుత్వం అందిస్తోన్న పలు సెక్షన్ల ద్వారా కొత్త ఇంటి కొనుగోలుపై సుమారు రూ. 5 లక్షలకు పైగా టాక్స్‌ ప్రయోజనాలను పొందవచ్చును. ఈ ప్రయోజనాలు జాయింట్‌ హోమ్‌లోన్‌పై వర్తిస్తాయి. 

పలు సెక్షన్ల కింద వచ్చే ప్రయోజనాలు ఇవే..!

సెక్షన్‌ 80సి
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్‌ 80సి తో సుమారు రూ. 1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చును. ఇది నేరుగా గృహ అసలు రుణంపై రానుంది.  ఈ రుణాన్ని కేవలం ఆర్‌బీఐ పరిధిలోకి వచ్చే ఆర్థిక సంస్థల నుంచి తీసుకుని ఉంటేనే అర్హులు. ఇల్లు నిర్మాణంలో ఉన్నా 5 సంవత్సరాల లోపు ఇంటిని విక్రయిస్తే ఈ ప్రయోజనం వర్తించదు.

సెక్షన్‌ 24బీ
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్‌ 24 కింద రూ. 2 లక్షల వరకు మినహాయింపు వర్తిస్తోంది. ఇది గృహరుణ వడ్డీ చెల్లింపులపై రానుంది. ఇంటి నిర్మాణం పూర్తి అయిన తర్వాత మాత్రమే టాక్స్‌ మినహాయింపు క్లెయిమ్‌ చేసుకోవాల్సి  ఉంటుంది. అయితే ఇంటి నిర్మాణం లోన్‌ తీసుకున్న 5 సంవత్సరాల్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. 

సెక్షన్‌ 80ఈఈ
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్‌ 80ఈఈ ప్రకారం రూ. 50 వేల వరకు డిడక్షన్‌ పొందవచ్చును.  ఇది కేవలం సదరు లోన్‌ అమౌంట్‌ రూ. 35 లక్షలకు మించకూడదు. దాంతో పాటుగా ప్రాపర్టీ వాల్యూ కూడా రూ. 50 లక్షలకు మించకూడదు. ఇది గృహరుణ వడ్డీ చెల్లింపులపై రానుంది. 

సెక్షన్‌ 80ఈఈఏ
ఆదాయం పన్ను చట్టంలోని సెక్షన్‌ 24 లిమిట్‌ పూర్తైన తర్వాత మాత్రమే సెక్షన్‌ 80ఈఈఏ కింద డిడక్షన్‌ పొందేందుకు వీలుంటుంది. ఈ సెక్షన్‌ కింద రూ. 1.50 లక్షల వరకు అదనపు తగ్గింపు పొందచ్చు. ఆస్తి స్టాంప్‌ డ్యూటి విలువ రూ. 45 లక్షలకు పెరగకూడదు. ఇది 'అఫర్జబుల్‌' గృహాలకు మాత్రమే వర్తిస్తుంది. 

ఈ ప్రయోజనాలను పొందాలంటే..సదరు వ్యక్తులు తొలిసారిగా ఇల్లు కొనుగోలు చేసి ఉండాలి. లోన్‌ తీసుకునే నాటికి ఎటువంటి రుణం  వ్యక్తి పేరుపై ఉండకూడదు.  

చదవండి: ఆకాశమే హద్దుగా కొత్త ఇళ్ల లాంచింగ్స్‌...! హైదరాబాద్‌ జోరు మాత్రం తగ్గేదేలే..!

మరిన్ని వార్తలు