కరోనా ఎఫెక్ట్‌: ఇక ఆ కార్లు ఉండవు

23 Dec, 2020 19:50 IST|Sakshi

సాక్షి, ముంబై: అసలే సంక్షోభంలో చిక్కుకున్న ఆటో పరిశ్రమను కరోనా వైరస్‌ మరింత దెబ్బతీసింది. లాక్‌డౌన్‌ కాలంలో అమ్మకాలు అసలే లేకపోవడంతో ఆదాయాలు క్షీణించి కుదేలయ్యాయి. దీంతో హోండా ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది.  తమ రెండు ప్లాంట్లలో ఒకదానిలో ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. గ్రేటర్ నోయిడా ప్లాంట్  వద్ద  హోండా వాహనాల ఉత్పత్తిని  నిలిపివేసింది. అంతేకాదు  గ్రేటర్ నోయిడా ప్లాంట్‌లో తయారయ్యే హోండా పాపులర్‌ కార్లు హోండా సివిక్‌, సీఆర్‌-వీ కార్లు ఇక​పై ఇండియాలో లభ్యంకావని వెల్లడించింది. భారీ పెట్టుబడి అవసరం కనుక ఈ రెండు కార్లను నిలిపివేయాలని కంపెనీ నిర్ణయించింది.

 బహుల జనాదరణ పొందిన హోండా సివిక్ ,హోండా సీఆర్‌-వీరెండు గ్లోబల్‌ మోడల్స్‌ను నిలిపివేయడం తమకు చాలాకష్టమైన నిర్ణయమని హెచ్‌సీఐఎల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ,డైరెక్టర్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాజేష్ గోయెల్   పేర్కొన్నారు. అయితే రాబోయే 15 సంవత్సరాలకు ఈ రెండు కార్ల యజమానులకు అన్ని విధాల తమ సహాయ సహకారాల్ని అందిస్తామన్నారు. తాజా నిర్ణయంతో హోండా పోర్ట్‌ఫోలియోలో కాంపాక్ట్ సెడాన్ అమేజ్, మిడ్-సైజ్ సెడాన్ హోండా సిటీ, సబ్-4 ఎమ్ ఎస్‌యువి డబ్ల్యుఆర్-వీ  ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ జాజ్ మాత్రమే అందుబాటులో ఉంటాయి. నోయిడా ప్లాంట్‌ పెద్ద హోండా వాహనాలు ఉత్పత్తి అవుతుండగా, రాజస్థాన్‌లోని రెండవ తపుకర ప్లాంట్ చిన్న,  హై-స్పీడ్  కార్లు తయారవుతున్నాయి. హోండా సిటీ ఉత్పత్తిని  తపుకరలోని ప్లాంట్‌కు మార్చనుంది.

మరిన్ని వార్తలు