ఎలక్ట్రిక్ మార్కెట్‌లోకి హోండా మోటార్స్

24 Oct, 2021 17:58 IST|Sakshi

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్‌, స్కూటర్‌ ఇండియా(హెైచ్‌ఎంఎస్‌ఐ) భారత్‌లోని ఎలక్ట్రిక్‌ వాహన విభాగంలోకి ప్రవేశించేందుకు సన్నహాలు చేస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో దేశంలో తన మొదటి ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను విడుదల చేయాలని భావిస్తున్నట్లు కంపెనీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దేశంలో యాక్టివా, షైన్ వంటి ప్రముఖ మోడల్స్ విక్రయించే ఈ సంస్థ తన డీలర్ భాగస్వాములతో ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది.

హెచ్ఎంఎస్ఐ అధ్యక్షుడు మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ అట్సుషి ఒగాటా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. "జపాన్ హోండా మోటార్ కంపెనీ తన మాతృ సంస్థతో చర్చించిన తర్వాత ఈ విభాగంలోకి ప్రవేశించాలని కంపెనీ నిర్ణయించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈవీ వాహనలను తయారు చేయడానికి సిద్దంగా ఉన్నట్లు" అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతానికి భారత్‌లో తమ ఎలక్ట్రిక్‌ వాహనం కోసం విడిభాగాల సేకరణ, సరఫరా భాగస్వాములకు చర్చలు ప్రారంభించామని చెప్పారు. భవిష్యత్తులో భారత్‌ నుంచి ఈవీలను ఎగుమతి చేస్తామని కంపెనీ వెల్లడించింది.(చదవండి: ఇండియన్ మార్కెట్లోకి లండన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ కారు)

ఎలక్ట్రిక్ వాహన రంగంలో పెట్టుబడులకు ప్రభుత్వం మద్దతు ఇస్తున్నందున విదేశీ కంపెనీలతో సహా పలు కంపెనీలు ఈవీ విభాగంలోకి ప్రవేశిస్తాయని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్లు మెట్రో నగరాలకు మాత్రమే చేరువ అయ్యాయని చిన్న పట్టణాలకు, గ్రామీణ ప్రాంతాలకు చేరువ కాలేదని అన్నారు. ఈవీ ప్రొడక్ట్ కు మాత్రమే పరిమితం కాకుండా బ్యాటరీ మేనేజ్ మెంట్ సిస్టమ్ తయారీ విషయాన్ని కూడా కంపెనీ పరిగణనలోకి తీసుకోబోతోందని ఒగాటా పేర్కొన్నారు.  హోండా మోటార్‌ ప్రపంచవ్యాప్తంగా 2024 నాటికి మూడు వ్యక్తిగత ఎలక్ట్రిక్‌ వాహనాలను విడుదల చేయనున్నట్టు గతంలో ప్రకటించింది.  

ఇప్పటికే చెన్నైకి చెందిన టీవీఎస్ మోటార్ కంపెనీ రాబోయే రెండేళ్లలో 5 నుంచి 25 కిలోవాట్ల సామర్ధ్యం గల ఎలక్ట్రిక్ టూ, త్రీ వీలర్ వాహనలను ప్రారంభించాలని చూస్తుంది. ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) వ్యాపారంపై రూ.1,000 కోట్ల పెట్టుబడిని కేటాయించిన సంస్థ సంప్రదాయ ఇంజిన్ వాహనాలపై కూడా పెట్టుబడులు పెట్టడం కొనసాగిస్తుంది. హీరో మోటోకార్స్‌, బజాజ్‌ ఆటో, టీవీఎస్‌ మోటార్‌, ఓలా లాంటి కంపెనీలు ఈ విభాగంలోకి వచ్చిన నేపథ్యంలో హోండా కంపెనీ ప్రవేశం ద్వారా పోటీ మరింత పెరుగుతుందని ఎలక్ట్రిక్‌ వాహన పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

(చదవండి: డౌన్‌లోడ్‌లో దూసుకెళ్తున్న ఇండియన్‌ ‘కూ’ యాప్‌)

మరిన్ని వార్తలు