Honda Shine 100cc: 100 సీసీ హోండా షైన్‌ వచ్చేసింది! ధర దాని కంటే తక్కువే..

15 Mar, 2023 17:28 IST|Sakshi

భారత బైక్ మార్కెట్‌లో హీరో తర్వాత హోండా కంపెనీ మోటార్‌సైకిళ్లు, స్కూటర్లకు అంతే స్థాయిలో పాపులారిటీ ఉంది. హోండా ఇండియా దేశంలో సరికొత్త షైన్ 100 సీసీ బైక్‌ను విడుదల చేసింది. ఇంతకు ముందు హోండా షైన్ 125 సీసీ బైక్‌లకు మంచి ఆదరణ వచ్చింది. ఈ నేపథ్యంలో అదే మోడల్‌ పేరుతో 100 సీసీ ఇంజన్‌తో హోండా కంపెనీ కొత్త బైక్‌ను విడుదల చేసింది.

ఇదీ చదవండి: Realme C33 2023: తక్కువ ధరలో రియల్‌మీ ఫోన్లు... కిర్రాక్‌ ఫీచర్లు!

హోండాకు సంబంధించి దేశంలో 125సీసీ ఆపైన మోడళ్లు అంటే.. యూనికాన్, హోండా షైన్ బైక్స్ హాట్‌ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. అయితే 100సీసీ బైక్‌ల విషయంలో మాత్రం హోండా వెనుకబడి ఉంది.  100 సీసీ రేంజ్‌ బైక్‌ల అమ్మకాల్లో హీరో కంపెనీకి తిరుగులేదు. దానికి కారణం హీరో స్ల్పెండర్‌ బైక్‌లు. ఈ నేపథ్యంలో వాటికి గట్టి పోటీ ఇచ్చేందుకు హోండా బాగా పాపులరైన షైన్‌ పేరుతో 100 సీసీ మోటర్‌ సైకిల్‌ తీసుకొచ్చింది. దీని ప్రారంభ ధర రూ.64,900 (ఎక్స్‌షోరూం). అంటే హీరో స్ల్పెండర్‌ ప్లస్‌ కంటే తక్కువే..

 

హోండా షైన్ 100 సీసీ ప్రత్యేకతలు
హోండా షైన్ 100 సీసీ బైక్‌ 6 సంవత్సరాల వారంటీ ప్యాకేజీతో వస్తుందని, ఇందులో 3 సంవత్సరాలు సాధారణ వారంటీ కాగా సంవత్సరాల ఎక్స్‌టెండెట్‌ వారంటీ అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.  పొడవాటి సీటు (677 మి.మీ), చిన్న లెగ్ ఓపెనింగ్ యాంగిల్‌తో కూడిన ట్యాంక్ ఉన్నాయి.

ఇంజిన్ ఇన్హిబిటర్‌తో కూడిన సైడ్ స్టాండ్‌ ఉంటుంది. దీని వల్ల సైడ్ స్టాండ్‌ వేసి ఉన్నప్పుడు ఇంజిన్‌ స్టార్ట్ చేయడానికి వీలుండదు. హోండా పేటెంట్ అయిన ఈక్వలైజర్‌తో కూడిన కాంబి బ్రేక్ సిస్టమ్ (సీబీస్‌)ను ఈ 100సీసీ బైక్‌లోనూ చేర్చారు.

ఇక డిజైన్‌ విషయానికొస్తే  హోండా షైన్ 125 ఉన్నట్టుగానే ఉంటుంది. అయితే అలాయ్‌ వీల్స్‌ తదితర చిన్న చిన్న మార్పులు ఉన్నాయి. హోండా షైన్ 100 సీసీ బైక్‌ ఐదు రంగుల్లో లభిస్తాయి. అవి బ్లాక్ విత్ రెడ్ స్ట్రిప్స్, బ్లాక్ విత్ గ్రే స్ట్రైప్స్, బ్లాక్ విత్ గోల్డ్ స్ట్రైప్స్, బ్లాక్ విత్ బ్లూ స్ట్రైప్స్, బ్లాక్ విత్ గ్రీన్ స్ట్రైప్స్.

ఇదీ చదవండి: మూత పడనున్న మరో బ్యాంక్‌? భారీగా పతనమైన షేర్లు..

మరిన్ని వార్తలు