ఈ కంపెనీ ఎయిర్‌ ఫిల్టర్‌తో కరోనా వైరస్‌ ఖతం..!

5 Aug, 2021 20:17 IST|Sakshi

వాషింగ్టన్‌: ప్రస్తుత మానవాళిని వెంటాడుతున్న పెద్ద సమస్య కరోనా వైరస్‌. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ కారణంగా అనేకమంది చనిపోయారు. కరోనా వైరస్‌ను ఎదుర్కొవడానికి పలు దేశాల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కూడా వేగంగానే కొనసాగుతుంది. కరోనా వైరస్‌ కూడా అంతేవేగంగా మ్యూటేషన్లకు గురై, కొత్త వేరియంట్లతో ఇబ్బంది పెడుతుంది. కరోనా వైరస్‌ ముప్పు నుంచి రక్షించడం కోసం ప్రముఖ ఏసీ తయారీ సంస్థ హనీవెల్‌ ఇంటర్నేషనల్‌ సరికొత్త ఏసీ ఎయిర్‌ ఫిల్టర్‌ను ఆవిష్కరించింది.

ఎయిర్‌కండిషనర్ల ఎయిర్‌ ఫిల్టర్లకు ప్రత్యేకమైన కోటింగ్‌ను అమర్చడంతో సుమారు 97 శాతం వరకు కరోనా వైరస్‌ను నాశనం చేయవచ్చునని హనీవెల్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది సెప్టెంబర్‌ చివరినాటికి  కోటింగ్‌ చేయబడిన ఎయిర్‌ఫిల్టర్‌ను అందుబాటులోకి వస్తుందని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డారియస్ ఆడమ్‌జిక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఏసీల ఏయిర్‌ఫిల్టర్లకు పూసే రసాయన కోటింగ్‌కు ఎన్విరానెమెంటల్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ  నుంచి ఆమోదం రావాల్సి ఉంది. ఈ ప్రక్రియను వేగవంతం చేయడం కోసం హనీవెల్‌ టెక్సాస్‌ , నార్త్‌ కరోలినా రాష్ట్రాలను భాగస్వాములుగా చేసుకోవాలని కంపెనీ ఆశిస్తుందని డారియస్ బ్లూమ్‌బర్గ్‌కు ఇచ్చిన ఇంటర్వ్వూలో పేర్కొన్నారు.

హనీవెల్‌ కంపెనీ ప్రయోగశాలలో నిర్వహించిన పరిశోధన ప్రకారం..కరోనా వైరస్‌ను నిర్మూలించడంలో ఎయిర్‌ ఫిల్టర్‌లు 97 శాతం వరకు ప్రభావవంతంగా పనిచేశాయని డారియస్ వెల్లడించారు. కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి, హనీవెల్ కంపెనీ N95 మాస్క్‌లు వంటి వ్యక్తిగత రక్షణ పరికరాలను ఉత్పత్తి చేసింది. హనీవెల్‌కు చెందిన రోబోట్‌లను ఉపయోగించి అల్ట్రా వైలెట్‌ కాంతితో విమానాలను శుభ్రం చేయడానికి ఉపయోగించారు.

మరిన్ని వార్తలు