Hong Kong టూరిస్టులకు పండగే: రూ.2వేల కోట్ల విలువైన టికెట్లు ఫ్రీ

8 Oct, 2022 13:32 IST|Sakshi

న్యూడిల్లీ: కోవిడ్‌ సంక్షోభంతో ప్రపంచవ్యాప్తంగా టూరిజానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. అయితే ఆంక్షల సడలింపు, ప్రస్తుతం నెలకొన్న సాధారణ పరిస్థితుల నేపథ్యంలో పర్యాటకులను ఆకర్షించేందుకు పలు దేశాలు నానా తంటాలు పడుతున్నాయి. తాజాగా పాపులర్‌ టూరిస్ట్‌ డెస్టినేషన్‌ హాంకాంగ్‌ టూరిస్టులకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. 5 లక్షల విమాన టిక్కెట్‌లను ఉచితంగా అందించాలని హాంకాంగ్ టూరిజం బోర్డు నిర్ణయించింది. సుమారు రూ. 2,083 కోట్లు (254.8 మిలియన్ డాలర్లు) విలువైన విమాన టికెట్లను ఉచితంగా ఆఫర్‌ చేయనుంది.

ఇదీ చదవండి :  చిన్నారులను మింగేసిన దగ్గు మందు: సంచలన విషయాలు

కోవిడ్‌-19 ఆంక్షలను తొలగిస్తామని ప్రభుత్వం ప్రకటించిన తర్వాత, ఉచిత విమాన టిక్కెట్ల ప్రకటనల ప్రచారాలను రూపొందిస్తామని హాంకాంగ్ టూరిజం బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డేన్ చెంగ్ మీడియాకు తెలిపారు. కేథే ఫసిఫిక్‌, కేథే డ్రాగన్‌, హాంకాంగ్‌ ఎయిర్‌లైన్స్‌, హాంకాంగ్‌ ఎక్స్‌ప్రెస్‌ లాంటి క్యారియర్‌ల ద్వారా ఈ టికెట్లను అందించనుంది. టిక్కెట్ల పంపిణీని హాంకాంగ్ ఎయిర్‌పోర్ట్ అథారిటీ నిర్వహిస్తుందని హాంకాంగ్ టూరిజం బోర్డు ప్రతినిధి వెల్లడించారు. (Infosys: మాజీ ఎగ్జిక్యూటివ్‌ ఫిర్యాదు, కోర్టులో ఇన్ఫోసిస్‌కు షాక్‌)

కాగా కరోనా సమయంలో అక్కడి ప్రభుత్వం కఠినమైన ఆంక్షలను అమలు చేసింది. ముఖ్యంగా హాంకాంగ్ చేరిన మూడు రోజుల తర్వాత బహిరంగ ప్రదేశాలకు వారి కదలికలను పరిమితం చేసేలా రెండు వారాల హోటల్ క్వారంటైన్ తప్పని సరిచేసింది. సెప్టెంబరులో ఈ  కరోనా ఆంక్షలు సడలించినప్పటికీ, పర్యాటకుల సంఖ్య తగినంత పుంజుకోకపోవడంతో  హాంకాంగ్‌ తాజా నిర్ణయం తీసుకున్నట్టు సమ​చారం. దీనికి తోడు ఉక్రెయిన్‌ యుద్ధం, రష్యా గగనతలం మూత  కారణంగా హాంకాంగ్ నుండి లండన్‌లోని హీత్రూకి దాదాపు రెండు గంటల  సమయం పడుతోందట. ఈ సమస్యల కారణంగా హాంకాంగ్‌లో తన కార్యకలాపాలను నిలిపివేస్తామని బ్రిటిష్ ఎయిర్‌లైన్ వర్జిన్ అట్లాంటిక్ బుధవారం తెలిపింది. అలాగే అనేక విమానయాన సంస్థలు విమానాలను నిలిపివేసాయి లేదా ఆ ప్రాంతంపై ప్రయాణించకుండా ప్రత్యామ్నాయమార్గాలను  ఎంచుకున్నాయి. 

ఇటీవలి గణాంకాలు ప్రకారం ఈ ఏడాది మొదటి ఎనిమిది నెలల(2022, జనవరి- ఆగస్టు) మధ్య హాంకాంగ్‌కు కేవలం 183,600 మంది మాత్రమే సందర్శకులు వచ్చారు. మునుపటి సంవత్సరంతో పోలిస్తే ఇది గణనీయమైన పెరుగుదలే. కానీ కరోనా ముందు (2019) నాటి  56 మిలియన్లతో  పోలిస్తే చాలా తక్కువ. అందుకే హోటల్ క్వారంటైన్‌ నిబంధనలను తొలగించిన అక్కడి ప్రభుత్వం ఇన్‌బౌండ్ ప్రయాణికులపై మిగిలిన ఆంక్షలను కూడా రద్దు చేయాలని భావిస్తోంది. ఫలితంగా రానున్న ఒకటి లేదా రెండు త్రైమాసికాలలో పర్యాటకులు తమ దేశానికి  తిరిగి వస్తారని అంచనా వేస్తోంది.  (ఫెస్టివ్‌ బొనాంజా: కెనరా బ్యాంకు కస్టమర్లకు శుభవార్త!)

 
 

 

మరిన్ని వార్తలు