హోటల్‌ అద్దెలు పైపైకి

29 Nov, 2023 00:47 IST|Sakshi

పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు 

క్రిస్‌మస్, నూతన సంవత్సరం బుకింగ్‌లు 

న్యూఢిల్లీ: నూతన సంవత్సరం, క్రిస్‌మస్, పెద్ద సంఖ్యలో వివాహాలు ఇవన్నీ కలసి హోటళ్ల ధరలను పెంచేస్తున్నాయి. వేడుకలు చేసుకునే వారు మరింత ఖర్చు చేయక తప్పని పరిస్థితి నెలకొంది. దేశంలోని ప్రముఖ ప్రాంతాల్లో హోటళ్లలో గదుల ధరలు గణనీయంగా పెరిగినట్టు మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి ఈ ఏడాది ఎన్నో ముఖ్యమైన కార్యక్రమాలు, సదస్సులు హోటళ్ల ధరలు పెరగడానికి దారితీశాయని చెప్పుకోవాలి.

కార్పొరేట్‌ బుకింగ్‌లు ఒకవైపు, మరోవైపు జీ20 దేశాల సద స్సు, ఐసీసీ ప్రపంచకప్‌ వంటివి కొన్ని పట్టణాల్లో హోటళ్లకు డిమాండ్‌ను అమాంతం పెంచేశాయి. అవే రేట్లు కొనసాగేందుకు లేదా మరింత పెరిగేందుకు పెద్ద సంఖ్యలో వివాహ వేడుకలు, ఏడాది ముగింపులో వేడుకలు తోడయ్యాయని చెప్పుకోవాలి. హోటళ్లలో వందల సంఖ్యలో పెళ్లి నిశ్చితార్థ కార్యక్రమాలకు ఇప్పటికే బుకింగ్‌లు నమోదైనట్టు యజమానులు చెబుతున్నారు.

దేశీ యంగా పర్యాటకుల సంఖ్య పెరగడం కూడా క్రిస్‌మస్‌–న్యూ ఇయర్‌ సందర్భంగా రేట్ల పెరుగుదలకు కారణంగా పేర్కొంటున్నారు. కొన్ని హోటళ్లలో ఇప్పటికే బుకింగ్‌లు అన్నీ పూర్తయిపోయాయి. ఉదయ్‌పూర్‌లోని హోటల్‌ లీలా ప్యాలెస్‌లో క్రిస్‌మస్‌ సందర్భంగా ఒక రాత్రి విడిదికి రూ.1,06,200గా (బుకింగ్‌ డాట్‌కామ్‌) ఉంది. సిక్స్‌ సెన్సెస్‌ ఫోర్ట్‌ బర్వారాలో ఒక రాత్రి విడిదికి రూ.1,64,919 వసూలు చేస్తున్నారు.  

డిమాండ్‌ అనూహ్యం 
రాజస్థాన్‌లో ఫోర్ట్‌ బర్వారా ప్రాపర్టీని నిర్వహించే ఎస్సైర్‌ హాస్పిటాలిటీ గ్రూప్‌ సీఈవో అఖిల్‌ అరోరా సైతం డిమాండ్‌ గణనీయంగా పెరిగినట్టు చెప్పారు. ‘‘ఈ ఏడాది పండుగల సీజన్‌లో డిమాండ్‌ చాలా ఎక్కువగా ఉంది. ఇది రేట్లు పెరిగేందుకు దారితీసింది. గతేడాదితో పోలిస్తే రేట్లు 10–15 శాతం మేర పెరిగాయి. సిక్స్‌సెన్స్‌ ఫోర్ట్‌ బర్వారా, జానా, కంట్రీ ఇన్‌ హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ తదితర మా హోటళ్లలో అతిథుల కోసం అద్భుతమైన వేడుకలకు ఏర్పాట్లు చేశాం.

కనుక వీలైనంత ముందుగా బుక్‌ చేసుకోవడం ద్వారా ప్రశాంతంగా ఉండొచ్చు’’అని అరోరా తెలిపారు. ఉదయ్‌పూర్‌లోని ఎట్‌ అకార్‌ అగ్జరీ హోటల్‌ ర్యాఫెల్స్‌ లో రోజువారీ ధరలు సగటున 24 శాతం మేర పెరిగాయి. గడిచిన ఆరు నెలల కాలంలో రేట్లు పెరిగినట్టు 49 శాతం మేర హోటల్‌ యాజమాన్యాలు తెలిపాయి. గోవా, పుదుచ్చేరి, ఊటీ క్రిస్‌మస్‌ వేడుకలకు ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్నారు. 
 

మరిన్ని వార్తలు