ఇండియా పాక్‌ మ్యాచ్‌.. అక్కడ కూడా ఫ్లాప్‌.. కానీ రూ.300 కోట్లు వెనక్కి

25 Oct, 2021 13:33 IST|Sakshi

Hotstar Ad Revenue During Ind Vs Pak T20 Match: టీ 20 ప్రపంచకప్‌లో ఇండియా, పాకిస్థాన్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌ భారత అభిమానులకు నిరాశ కలిగించినా హాట్‌స్టార్‌కు మాత్రం ఆనందాన్నే పంచింది.ఈ ఒక్క మ్యాచ్‌ ద్వారానే పెట్టుబడిలో మూడొంతులు ఆ సంస్థకు వచ్చేసింది.

హాట్‌స్టార్‌ హ్యాపీయేనా
ఇండియా, పాకిస్థాన్‌ల మధ్య మ్యాచ్‌ అంటే రెండు దేశాల్లో అనధికారిక కర్ఫ్యూ వాతావరణం నెలకొంటుంది. కోట్లాది మంది ప్రజలు టీవీలకు అతుక్కుపోతారు. అయితే ఈసారి టీ20 మ్యాచ్‌ పూర్తిగా ఏకపక్షంగా జరగడంతో కర్ఫ్యూ తరహా వాతావరణం ఎక్కువ సేపు లేదు. అయినా సరే ఈ మ్యాచ్‌ డిజిటల్‌ ప్రచార హక్కులు దక్కించుకున్న హాట్‌స్టార్‌ బాగానే సొమ్ము చేసుకుంది.

విరాట్‌ కోసం
ఇండియా పాకిస్థాన్‌ మ్యాచ్‌ సందర్భంగా హయ్యస్ట్ వ్యూయర్‌ షిప్‌గా 14 మిలియన్లుగా నమోదు అయ్యింది. మ్యాచ్‌ 16వ ఓవర్‌లో విరాట్‌ కోహ్లీ హాఫ్‌ సెంచరీ చేసిన సందర్భంలో హాట్‌స్టార్‌లో 1.40 కోట్ల మంది  మ్యాచ్‌ని వీక్షించారు. మొత్తం మ్యాచ్‌లో ఇదే అత్యధిక వ్యూయర్‌షిప్‌ సాధించిన సమయంగా నిలిచింది. ఇక పాకిస్తాన్‌ బ్యాటింగ్‌ మొదలై మొదటి పది ఓవర్లు ముగిసే సరికి వ్యూయర్‌షిప్‌ సగానికి సగం పడిపోయి 7.5 మిలియన్ల దగ్గర నమోదయ్యింది. 

ఆడకపోయినా అండగా
భారత్‌, పాక్‌ల మధ్య మ్యాచ్‌ అనగానే టాస్‌ వేయడం ఆలస్యం హాట్‌స్టార్‌లో వ్యూయర్‌ షిప్‌ అలా అలా పెరుగుతూ పోయింది. మొదటి బాల్‌ వేసే సమయానికే 4.1 మిలియన్ల మంది హాట్‌స్టార్‌కి అతుక్కుపోగా మూడో బాల్‌ వేసే సరికి ఆ సంఖ్య 5.9 మిలియన్లకి చేరుకుంది. ఓపెనర్లు త్వరగా అవుటైపోయినా అభిమానులు నమ్మకం కోల్పోలేదు. విరాట్‌ ఉన్నాడనే భరోసాతో భారత్‌ బ్యాటింగ్‌ పూర్తయ్యే వరకు 10 మిలియన్లకు పైగానే వీక్షకులు ఉన్నారు. ఆ తర్వాత ఈ సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టింది.

రూ. 300 కోట్లు
ఇండియాపై పాకిస్తాన్‌ పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించడంతో పాటు వరల్డ్‌కప్‌లో ఆ జట్టుకి ఉన్న పాత రికార్డును చెరిపేసింది. దీంతో దేశవ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. కానీ మ్యాచ్‌లో యాడ్స్‌ ప్రసారం చేయడం ద్వారా హాట్‌స్టార్‌కి ఏకంగా రూ.300 కోట్ల రూపాయల ఆదాయం దక్కింది. ఈ హైటెన్షన్‌ మ్యాచ్‌కి ప్రీమియం టారిఫ్‌లు అమలు చేశారు. దీంతో రికార్డు స్థాయి ఆదాయం దక్కింది. ఈ వరల్డ్‌ కప్‌ డిజిటల్‌ హక్కులకు హాట్‌స్టార్‌ రూ. 1000 కోట్లు వెచ్చించగా ఒక్క పాక్‌ ఇండియా మ్యాచ్‌తోనే రూ. 300 కోట్లు వెనక్కి వచ్చేశాయి.

రికార్డు పదిలం
ఐపీఎల్‌ 13వ సీజన్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, ముంబై ఇండియన్స్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌కి ఏకంగా 18 మిలియన్‌ వ్యూస్‌ వచ్చాయి. ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ఇదే రికార్డు. ఇండియా,  పాక్‌ మ్యాచ్‌ ఈ రికార్డును బద్దుల కొడుతుందని అంతా అంచనా వేశారు. కానీ మైదానంలో టీమిండియా ఆటగాళ్లు చేతులెత్తేయడంతో అభిమానులు సైతం మ్యాచ్‌ పట్ల పెద్దగా ఆసక్తి చూపలేదు. 

మరిన్ని వార్తలు