ఇక ముందూ ఇళ్లకు డిమాండ్‌.. గృహ నిర్మాణంలో పెద్ద ఎత్తున ఉపాధి

25 Aug, 2023 03:56 IST|Sakshi

ఆర్థిక వృద్ధికి సాయపడుతుంది

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ డైరెక్టర్‌ కేకీ మిస్త్రీ

కోల్‌కతా: ఇళ్ల కోసం డిమాండ్‌ ఇక ముందూ కొనసాగుతుందని, ఆర్థిక వ్యవస్థ సామర్థ్యాలను వెలికితీసే శక్తి ఈ రంగానికి ఉందని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ డైరెక్టర్‌ కేకీ మిస్త్రీ పేర్కొన్నారు. గృహ నిర్మాణ రంగం పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇతర విభాగాలతో పోలిస్తే గృహ రుణాలు సురక్షితమని, వీటిల్లో రుణ రిస్క్‌ చాలా తక్కువని చెప్పారు. బంధన్‌ బ్యాంక్‌ వ్యవస్థాపక దినం వేడుకల్లో భాగంగా మిస్త్రీ మాట్లాడారు.

గృహ రుణాల్లో అగ్రగామి కంపెనీ హెచ్‌డీఎఫ్‌సీ ఇటీవలే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో విలీనం అవ్వడం గమనార్హం. తక్కువ ఎన్‌పీఏలతో భారత బ్యాంకింగ్‌ రంగం మరంత బలంగా ఉన్నట్టు చెప్పారు. అమెరికా, చైనాతో పోలిస్తే గృహ రుణాలు మన దేశంలో చాలా తక్కువ స్థాయిలోనే ఉన్నట్టు మిస్త్రీ తెలిపారు. మన జీడీపీలో మార్ట్‌గేజ్‌ నిష్పత్తి చాలా తక్కువ ఉందన్నారు. ఇళ్లకు నిర్మాణాత్మక డిమాండ్‌ ఎప్పటికీ ఉంటుందన్నారు.

కార్పొరేట్‌ గవర్నెన్స్‌ (సీజీ)పై స్పందిస్తూ.. స్వతంత్ర డైరెక్టర్ల పాత్రను మరింత బలోపేతం చేయాలని అభిప్రాయపడ్డారు. ‘‘కంపెనీలు ఎలా పనిచేస్తున్నాయనే దానికి సీజీ ఒక కొలమానం. దీర్ఘకాలం పాటు నిలదొక్కుకోవాలంటే బలమైన కార్పొరేట్‌ గవర్నెన్స్‌ సూత్రాలు తప్పనిసరి. మంచి సీజీ అనేది అనుకూలం. ఇది ఉంటే ఇన్వెస్టర్లు అధిక ధర చెల్లించేందుకు ముందుకు వస్తారు’’అని మిస్త్రీ వివరించారు.

వాటాదారులు, నిర్వాహకుల మధ్య ఇండిపెండెంట్‌ డైరెక్టర్లు వాహకం మాదిరిగా పనిచేస్తారని చెప్పారు. కార్పొరేట్‌ గవర్నెన్స్‌కు తోడు ఈఎస్‌జీ సైతం వ్యాపారాలకు కీలకమని మారిపోయినట్టు ప్రకటించారు. ‘‘ఇటీవలి సంవత్సరాల్లో భారత్‌ వృద్ధి అంచనాలను మించింది. భారత్‌ వృద్ధి అవకాశాలను విదేశీ ఇన్వెస్టర్లు ఇప్పుడు గురిస్తున్నారు. యూఎస్, చైనా తర్వాత మూడో అతిపెద్ద వినియోగ మార్కెట్‌గా భారత్‌ అవతరిస్తుంది’’అని మిస్త్రీ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు