బ్యాంకులతో పోలిస్తే తక్కువే..అందుబాటు ధరల్లో హోమ్ లోన్లు!

16 Sep, 2022 08:54 IST|Sakshi

ముంబై: హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు(హెచ్‌ఎఫ్‌సీ లు)గృహ రుణాల్లో మార్కెట్‌ వాటాను బ్యాంకుల కు కోల్పోతున్నట్టు రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ తెలిపింది. హెచ్‌ఎఫ్‌సీల నిర్వహణ ఆస్తుల్లో (ఏయూఎం) వేగవంతమైన వృద్ధి ఉన్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మార్కెట్‌ వాటాను కోల్పోనున్నట్టు అంచనా వేసింది. హెచ్‌ఎఫ్‌సీల ఏయూఎం 2022–23లో 10–12 శాతం పెరుగుతాయని పేర్కొంది. 

క్రితం ఆర్థిక సంవ్సరంలో వృద్ధి 8 శాతంగా ఉన్నట్టు తెలిపింది. బ్యాంకులు గృహ రుణాల విభాగంలో చురుగ్గా వ్యవహరిస్తున్నందున, హెచ్‌ఎఫ్‌సీల ఆస్తులు వృద్ధి చెందినా, మార్కెట్‌ వాటాను కాపాడుకోవడం కష్టమేనని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఎందుకంటే గడిచిన నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు బ్యాంకులకు మార్కెట్‌ వాటా నష్టపోవడాన్ని ప్రస్తావించింది. గృహ రుణాల్లో బ్యాంకుల వాటా 4 శాతం పెరిగి 2022 మార్చి నాటికి 62 శాతంగా ఉన్నట్టు క్రిసిల్‌ నివేదిక వెల్లడించింది. గృహ రుణాల్లో బ్యాంకులు మార్కెట్‌ వాటాను పెంచుకోవడం సమీప కాలంలో ఆగకపోవచ్చని క్రిసిల్‌ తెలిపింది. గృహ రుణాల్లో దేశంలోనే అదిపెద్ద సంస్థ అయిన హెచ్‌డీఎఫ్‌సీ వెళ్లి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో విలీనం అవుతుండడం ఈ విభాగంలో బ్యాంకుల వాటా మరింత పెరిగేందుకు దారితీస్తుందని పేర్కొంది.  

అందుబాటు గృహ రుణాలు 
ఇక హెచ్‌ఎఫ్‌సీలు మార్కెట్‌ వాటాను పెంచుకునేందుకు ఆశావహ పరిస్థితి అందుబాటు ధరల గృహ రుణాల్లో మాత్రమే ఉన్నట్టు క్రిసిల్‌ వెల్లడించింది. ఈ విభాగంలో బ్యాంకుల నుంచి పోటీ చాలా తక్కువగా ఉండడాన్ని ఇందుకు మద్దతుగా పేర్కొంది. 2022–23లో అందుబాటు ధరల గృహ రుణాల్లో 18–20 శాతం వృద్ధి ఉంటుందని అంచనా వేసింది. ‘‘సంప్రదాయ వేతన ఉద్యోగుల విభాగంలో గృహ రుణాల పరంగా బ్యాంకులతో పోటీ పడడం హెచ్‌ఎఫ్‌సీలకు సవాలే అవుతుంది. ఎందుకంటే వాటికి నిధుల సమీకరణ వ్యయాలు అధికంగా ఉండడం వల్లే’’అని క్రిసిల్‌ వివరించింది.

హెచ్‌ఎఫ్‌సీలకు నిధుల సమీకరణ కష్టమేమీ కాదంటూ, బ్యాంకులకు మాత్రం తక్కువ వ్యయాలకే డిపాజిట్లు (కాసా) అందుబాటులో ఉండడం అనుకూలతగా పేర్కొంది. నియంత్రణ పరమైన నిబంధనలు కఠినంగా మారుతుండడం, కార్పొరేట్‌ బాండ్‌ మార్కెట్‌ బలంగా లేకపోవడంతో హెచ్‌ఎఫ్‌సీలు తమ వ్యాపార నమూనాలను సవరించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. హెచ్‌ఎఫ్‌సీలు బ్యాంకులతో భాగస్వామ్యం పెంచుకోవడంపై దృష్టి పెట్టాలని సూచన చేసింది. తద్వారా ఒకరి బలాలు మరొకరికి సానుకూలిస్తాయని పేర్కొంది. 202–23లో హెచ్‌ఎఫ్‌సీల గృహ రుణాలు 15 శాతం వృద్ధిని చూస్తాయని అంచనా వేసింది. డెవలపర్‌ ఫైనాన్స్, ప్రాపర్టీపై ఇచ్చే రుణాల్లో వృద్ధి ఫ్లాట్‌గా ఉంటుందని పేర్కొంది.    

మరిన్ని వార్తలు